ఏపి అసెంబ్లీలో ‘మూడో క్యాటగిరి’ ఎంఎల్ఏలు

First Published Nov 29, 2017, 7:43 AM IST
Highlights
  • ఏపి అసెంబ్లీలో విచిత్రమైన పరిస్ధితులు కనబడుతున్నాయి.

ఏపి అసెంబ్లీలో విచిత్రమైన పరిస్ధితులు కనబడుతున్నాయి. ఈ పరిస్ధితులకు కచ్చితంగా చంద్రబాబునాయుడే బాధ్యత వహించాలి. ఇంతకీ ఆ విచిత్రమైన పరిస్ధితులు ఏంటంటే, అసెంబ్లీలో ‘మూడో క్యాటగిరీ’ పెరుగుతోంది. మూడో క్యాటగిరీ అంటే ఇంకేదో అనుకునేరు ? 2014లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు రెండు పక్షాలకే ఓట్లు వేశారు. అందులో మొదటి పక్షం టిడిపి+భారతీయ జనతా పార్టీలు మిత్రపక్షాలు కాగా రెండో పక్షం వైఎస్సార్ సిపి. ఇందులో మొదటి పక్షానికి అధికారం అప్పగించిన జనాలు రెండో పక్షం వైసిపిని ప్రతిపక్షంగా డిసైడ్ చేశారు.

కానీ రోజులు గడిచేకొద్దీ 40 ఇయర్స్ ఇండస్ట్రి ఏం చేశారంటే, తన రాజకీయ చాతుర్యాన్నంతా రంగరించి మూడో క్యాటిగిరీని తయారు చేశారు. వాళ్ళే వైసిపి ఫిరాయింపు ఎంఎల్ఏలు. ఇప్పటికి 23 మంది మూడో క్యాటగిరీ క్రిందకు వచ్చారు. భవిష్యత్తులో ఇంకెంతమంది చేరుతారో చెప్పలేం. వైసిపి ఫిరాయింపులందరికీ జనాలు మూడో క్యాటగిరీ అని ముచ్చటగా ముద్రవేశారు. ఎందుకంటే, వీరు అధికారపార్టీ క్రిందకీ రారు. అలాగని ప్రతిపక్ష ఎంల్ఏలూ కారు.

వైసిపి నుండి ఫిరాయించిన వారు తమ ఎంఎల్ఏ పదవులకు రాజీనామాలు చేశారా అంటే చేయలేదనే చెప్పాలి. పోనీ వీళ్ళని జనాలు టిడిపి ఎంఎల్ఏలుగా గుర్తిస్తున్నారా అంటే అదీ లేదు. రాజీనామాలు చేసి ఉపఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేదు వీళ్ళలో ఎవరికీ. పోనీ చంద్రబాబైనా అందరితోనూ రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలు నిర్వహిస్తారా అంటే ఆపని చంద్రబాబూ చేయటం లేదు.

అంటే వైసిపి నుండి ఫిరాయించిన 23 మంది ఇటు వైసిపి ఎంఎల్ఏలూ కాక అటు టిడిపి ఎంఎల్ఏలూ కాక మరి ఏ పార్టీ క్రింద లెక్కకు వస్తారు. వీరిని లెక్కేయటానికి ఇంకో పార్టీ కూడా లేదు. అందుకే ఈ ఫిరాయింపులను అందరూ మూడో క్యాటగిరీ అంటూ ఎగతాళి చేస్తున్నారు. విచిత్రమేమిటంటే, వీరందరినీ అసెంబ్లీ రికార్డల్లో ఇంకా వైసిపి సభ్యులుగానే చూపించటం.

వైసిపి ఏమో ఫిరాయింపు ఎంఎల్ఏలు తమ సభ్యులు కాదు కాబట్టి వాళ్ళందరిని అనర్హులుగా ప్రకటించమని ఎప్పటి నుండో డిమాండ్ చేస్తోంది. సరే, స్పీకర్ నుండి సమాధానం లేదనుకోండి అది వేరే విషయం. మొత్తం మీద చంద్రబాబు 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఎందుకు ఉపయోగపడుతోందంటే అసెంబ్లీలో మూడో క్యాటగిరి ఎంఎల్ఏలను తయారు చేయటానికి మాత్రమే అని అర్ధమైపోతోంది.

 

click me!