
చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై నెటిజన్లు మండిపడుతున్నారు. చంద్రబాబు, లోకేష్ పై వ్యతిరేక కార్టూన్లు వేసారన్న కారణంతో పొలిటికల్ పంచ్ గ్రూపు అడ్మిన్ రవికిరణ్ న్ను అరెస్టు చేయటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాను నియంత్రించాలని చూడటమంటే వ్యక్తిగత స్వేచ్చను హరించటమేనంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లను నియంత్రించాలని చూడటమంటే తాము తప్పులు చేస్తున్నట్లు అంగీకరించటమేనంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టులు చూస్తుంటేనే చంద్రబాబు ప్రభుత్వపై నెటిజన్లు ఏ స్ధాయిలో ఆగ్రహంగా ఉన్నారో అర్ధమైపోతోంది.
తమ తప్పులను సవరించుకోవాల్సిందిపోయి సోషల్ మీడియాను కట్టడి చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం త్వరలో ప్రత్యేక చట్టాన్ని తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందుకు అవసరమైన కసరత్తు చేయాలంటూ ప్రభుత్వం కొందరు నిపుణులకు ఇప్పటికే ఆదేశాలిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
టిడిపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చంద్రబాబు, లోకేష్ పై సోషల్ మీడియాలో వ్యతిరేక కార్టూన్లు వస్తున్న మాట నిజమే. ఎందుకంటే, వారి మాటలూ అలానే ఉన్నాయ్ మరి. సోషల్ మీడియా బలమేంటో టిడిపితో పాటు ప్రధానప్రతిపక్షమైన వైసీపీకి కూడా బాగా తెలుసు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా టిడిపి ఐటి విభాగం, మద్దతుదారులు ఏ స్ధాయిలో సోషల్ మీడియాలో రెచ్చిపోయారో అందరికీ తెలిసిందే. ఇపుడదే అస్త్రాన్ని వైసీపీ టిడిపిపైకి ప్రయోగిస్తోంది. దానికితోడు వైసీపీ సానుభూతిపరులు, మద్దతుదారులు కూడా చంద్రబాబు ప్రభుత్వంపై రెచ్చిపోతున్నారు.
చంద్రబాబు, లోకేష్ ప్రకటనల్లోని తప్పులను, ప్రభుత్వ పనితీరును ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ఏకిపారేస్తోంది. ఒకవిధంగా మీడియా నిర్వర్తించాల్సిన బాధ్యతలను సోషల్ మీడియా నిర్వర్తిస్తోంది. అనుక్షణం చంద్రబాబు, లోకేష్ చేస్తున్నతప్పులపై నిఘాపెట్టినట్లైంది. దాంతో తండ్రి, కొడుకులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తమకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని సహించలేకున్నారు. ఇందులో భాగంగానే ఫేస్‌బుక్‌లోని కొన్ని పేజీలు, వెబ్‌సైట్లపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.