
‘చేయగలిగిందే చెప్పండి..అధికారం కోసం అబద్దాలు చెప్పవద్దు’..ఇది చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు. టిడిపి నేతల వర్క్ షాపులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇపుడు పెద్ద చర్చనీయాంశమైంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు చేసిన హామీలన్నింటినీ చేయగలిగే చెప్పారా? అన్న చర్చ మొదలైంది. కేవలం అధికారం కోసమే హామీలిచ్చి తర్వాత వాటిని గాలికొదిలేసిన వైనంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
రాష్ట్ర విభజనతో అసలే దెబ్బతిన్న రాష్ట్రంలో అధికారంలోకి రావటమే ఏకైక లక్ష్యంతో రుణమాఫీ హామీలిచ్చారు చంద్రబాబు. సరే, ఇదంటే సిఎం చేతిలోనే ఉన్న అంశం కాబట్టి ఎలాగోలా నిధులు సర్దుబాటు చేస్తారులే అని అనుకున్నారు. కానీ కాపులను బిసిల్లోకి మారుస్తానని ఇచ్చిన హామీ మాటేమిటి? కాపులను బిసిల్లోకి మార్చటమన్నది చంద్రబాబు చేతిలో లేదుకదా? రిజర్వేషన్లు కేంద్రప్రభుత్వ పరిధిలోని అంశం. చంద్రబాబిచ్చిన హామీతోనే కాపులు-బిసిల మధ్య వివాదాలు మొదలవ్వటం వాస్తవం కాదా?
ఇక, రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విశాఖపట్నాన్ని ప్రత్యేక రైల్వేజోన్ గా చేయటం తదితరాలు ఆయన చేతిలో లేవు. కానీ వాటిపైన కుడా హామీలిచ్చారు కదా? అధికారంలోకి రాగానే చేయగలిగారా? పై రెండు ప్రధాన డిమాండ్ల సాధన విషయంలో సిఎం ఎన్నిమార్లు పిల్లిమొగ్గలేసింది అందరూ చూసారు. చివరకు వ్యవసాయ, డ్వాక్రా, చేనేత రుణాల హామీ ఎంతవరకూ అమలయ్యిందంటే అధికారపార్టీ నేతలు కుడా సరిగ్గా సమాధానమివ్వలేరు.
పైగా తానిచ్చిన హామీలన్నీ ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చాను కాబట్టి విభజిత ఏపిలో అమలు సాధ్యం కాదని చెప్పటమే అతిపెద్ద అబద్దం. ఎన్నికల హామీల విషయంలో చంద్రబాబే ఇన్ని తప్పుడు హామీలిచ్చి, ఎన్నికల్లో చేయగలిగిందే చెప్పండి, అబద్దాలు చెప్పవద్దు అని నేతలకు చెప్పటం హాస్యాస్పదం. ఎందుకంటే, అభ్యర్ధులు ఎవరికి వారుగా ఎన్నికల హామీలిస్తారా ఎక్కడైనా? మొత్తం మీద పార్టీ అధ్యక్షుని హోదాలో ఇచ్చే హామీలే అన్నీ నియోజకవర్గాల్లోనూ ప్రచారమవుతాయి. ఏదో ఒకటి అరా స్ధానిక సమస్యల విషయంలో మాత్రం అభ్యర్ధులు మాట్లాడుతారంతే. ఈ విషయాలు తెలీకుండానే చంద్రబాబు నేతలకు బుద్దులు చెప్పారా?