చంద్రబాబును వెన్నాడుతున్న మావోయిస్టులు

First Published Dec 31, 2016, 8:19 AM IST
Highlights

ఇప్పటికి ఆరుసార్లు మావోయిస్టులు ఏపి భవన్ చుట్టుపక్కల రెక్కీ కూడా నిర్వహించినట్లు ఇంటెలిజెన్స్ శాఖ చెబుతోంది. చంద్రబాబు ఢిల్లీకి వచ్చినపుడల్లా మావోయిస్టులూ వస్తున్నారు.

నిజంగా సంచలనమే. మావోయిస్టులు చంద్రబాబునాయడును ఇంకా వెన్నాడుతున్నారా ? తాజాగా ఢిల్లీ పోలీసులు చెప్పిన ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. చంద్రబాబు ఢిల్లీకి  చేరుకున్నపుడల్లా మావోయిస్టులు కూడా ఢిల్లీకి వస్తున్నట్లు ఇంటెలిజెన్స్ పోలీసులు చెబుతున్నారు.

 

ఇప్పటికి ఆరుసార్లు మావోయిస్టులు ఏపి భవన్ చుట్టుపక్కల రెక్కీ కూడా నిర్వహించినట్లు ఇంటెలిజెన్స్ శాఖ చెబుతోంది. చంద్రబాబు ఢిల్లీకి వచ్చినపుడల్లా మావోయిస్టులూ వస్తున్నారు. అంటే చంద్రబాబు కదలికలను మావోయిస్టులు నిశితంగా గమనిస్తున్నట్లే. మావోయిస్టుల కదలికలను గమనించిన ఇంటెలిజెన్స్ వర్గాలు ఇదే విషయాన్ని ఏపి భవన్ ఉన్నతాధికారులను హెచ్చరించాయి.

 

అయినా, చంద్రబాబుకు భద్రతను పెంచలేదని ఇంటెలిజెన్స్ వర్గాలు ఏపి భవన్ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారంలో ఉంది. పైగా మీడియా ముసుగులో దాడులు జరగవచ్చిన కూడా పోలీసులు అనుమానిస్తుండటం నిజంగా సంచలనమే.

 

ఇదిలావుండగా, రాష్ట్ర డిజిపి సాంబశివరావు ఇదే విషయమై మాట్లాడుతూ, ఏపి భవన్ లో మావోయిస్టుల కదలికలపై ఎటువంటి సమాచారం లేదన్నారు. గతంలో అందిన హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని చెప్పారు.

కాగా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తిరుమల ఘాట్ రోడ్డు మొదట్లోనే  2003లో మావోయిస్టులు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ దాడి నుండి చంద్రబాబు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అప్పటి నుండి చంద్రబాబుకు మావోయిస్టుల నుండి ముప్పు పొంచి ఉంది.

 

అందుకే ప్రభుత్వం సిఎంకు జడ్ క్యాటగిరీ భద్రత ఏర్పాటు చేసింది. సిఎంను హతమారుస్తామంటూ మావోయిస్టులు కూడా అప్పటి నుండి హెచ్చరిస్తూనే ఉన్నారు.

 

రెండు మాసాల క్రితం ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో దాదాపు 25 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి విధితమే. అప్పటి నుండి మావోయిస్టులు చంద్రబాబుపై గురిపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఇపుడు ఢిల్లీ ఇంటెలిజెన్స్ పోలీసులు చేసిన హెచ్చరికలతో అధికార పార్టీలో కలకలం రేగుతోంది.

click me!