జగన్ పాదయాత్రతో టిడిపిలో పెద్ద కుదుపు:చంద్రబాబుకు షాక్

First Published Apr 11, 2018, 2:01 PM IST
Highlights
కృష్ణా జిల్లాలోకి పాదయాత్ర సందర్భంగా అడుగు పెట్టే సమయానికి పలువురు కమ్మ సామాజికవర్గం నేతలు వైసిపిలో చేరటానికి ముందుకొస్తున్నారు.

రాజధాని ప్రాంత జిల్లాల్లో పట్టుకోసం వైసిపి అధ్యక్షుడు పన్నిన వ్యూహాలు ఫలిస్తున్నట్లే కనబడుతోంది. కృష్ణా జిల్లాలోకి పాదయాత్ర సందర్భంగా అడుగు పెట్టే సమయానికి పలువురు కమ్మ సామాజికవర్గం నేతలు వైసిపిలో చేరటానికి ముందుకొస్తున్నారు.

రాజధాని  జిల్లాలైన గుంటూరు, కృష్ణాలో రాజకీయంగా పట్టు సాధించాలంటే కమ్మ సామాజికవర్గం నేతల మద్దతు చాలా అవసరమన్న విషయం తెలిసిందే. పై జిల్లాల్లో నిజానికి కమ్మ సామాజికవర్గం జనాభా కన్నా బిసిలు, కాపులు ఎక్కువ.

అయితే, ఏ సామాజికవర్గం జనాభా ఎంతుంది అన్నది పక్కన పెడితే చాలా నియోజకవర్గాల్లో రాజకీయంగా మాత్రం కమ్మోరిదే ఆధిపత్యం. పై రెండు జిల్లాల్లో 32 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయ్. జిల్లాల స్వరూపం తెలిసిన వ్యక్తి కావటంతో జగన్ పై సామాజికవర్గం మద్దతు కోసం పావులు కదుపుతున్నారు. ఆ బాధ్యతను ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, కొడాలి నాని, వంగవీటి రాధాలకు అప్పగించారు.

అందులో భాగంగానే వీరు ముగ్గురు వ్యూహం రచించారు. ఉండటానికి చాలామంది కమ్మ నేతలు చంద్రబాబుపై అసంతృప్తితో ఉన్నా ఇపుడే బయటపడటానికి ఇష్టపడటం లేదు. చాలాకొద్ది మంది మాత్రమే ధైర్యంగా బయటకు వస్తున్నారు. అటువంటి వారిలో టిడిపికి చెందిన ముగ్గురు నేతలు కొద్ది రోజుల్లో వైసిపి కండువా కప్పుకోవటానికి సిద్దపడ్డారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గం మాజీ ఎంఎల్ఏ యలమంచిలి రవి, మైలవరం టిక్కెట్టు ఆశిస్తున్న సీనియర్ నేత వసంత కృష్ణ ప్రసాద్, తాజాగా గన్నవరంకు చెందిన దాసరి జై రమేష్ ఉన్నారు. ఇప్పటికే రవి గుంటూరు పాదయాత్రలో ఉన్న జగన్ ను సోమవారం కలిసారు. 16వ తేదీన వైసిపిలో చేరుతున్నట్లు చెప్పారు.

ఇక, వసంత, దాసరి ఎప్పుడు చేరేది స్పష్టంగా తెలీదు.

వారంతా టిడిపిని వదిలేసి వైసిపిలో చేరటానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఒకటి వారందిరినీ అధిష్టానం పట్టించుకోకపోవటం, రెండు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటానికి టిడిపిలో అవకాశం రాదని తేలిపోవటం.

దాంతో ప్రత్యామ్నాయ మార్గాలుగా వారంతా వైసిపిని ఎంచుకుంటున్నారు. ముందు వీరు చేరితే భవిష్యత్తులో ఇంకెంతమంది కమ్మ సామాజికవర్గం నేతలు చేరుతారో తేలుతుంది.

click me!