
తెలుగుదేశంపార్టీలో ఓ లిస్ట్ తయారైందట. ఇంతకీ ఆ లిస్ట్ ఏంటంటే, ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో విఫలమైన నేతలు, నియోజకవర్గాల జాబితాలట. చంద్రబాబునాయుడు లెక్క ప్రకారమే ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం పెద్దగా సక్సెస్ కాలేదు. మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ కార్యక్రమం జరుగుతోంది. గట్టిగా చెప్పాలంటే చివరిదశకు వచ్చేసింది కూడా. ఇటీవలే నియోజకవర్గాల్లో కార్యక్రమం అమలవుతున్న విధానాన్ని చంద్రబాబు రివ్యూ చేసారు.
చంద్రబాబు రివ్యూ ప్రకారమే చాలా నియోజకవర్గాల్లో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన కార్యక్రమం విఫలమైంది. ఎందుకంటే, చాలా నియోజకవర్గాలకు చంద్రబాబు ఇచ్చింది మరి సి, డి గ్రేడ్లే. పార్టీ వర్గాల ప్రకారం సుమారు 100 నియోజకవర్గాలకు సి, డి గ్రేడ్లు వచ్చాయట. అంటే చాలా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్ధితి చాలా అధ్వాన్నంగా ఉందన్న విషయం అర్ధమవుతోంది. అనంతపురం, కర్నూలు, చిత్తూరు తూర్పు గోదావరి తదితర జిల్లాల్లో కార్యక్రమం జరిగిన తీరుపట్ల స్వయంగా చంద్రబాబు పై జిల్లాల నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే.
అందుకనే తాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమాన్ని ఏ ఏ నియోజకవర్గాల్లో విఫలమైందో వివిధ మార్గాల్లో చంద్రబాబు వివరాలు తెప్పించుకున్నారు. దాని ఆధారంగానే ఓ జాబితాను రూపొందించారట. పార్టీ అధికారంలో ఉండి కూడా ఓ కార్యక్రమాన్ని ఎంఎల్ఏలు, నియోజకవర్గాల ఇన్చార్జిలు విజయంతం చేయలేకపోయారంటే ఆశ్చర్యంగానే ఉంది.
అదే సమయంలో వైసీపీ చేపడుతున్న ‘వైఎస్సార్ కుటుంబం’ కార్యక్రమం విజయవంతమైనట్లు పార్టీ నాయకత్వం ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అంటే, ప్రతిపక్షం చేపట్టిన కార్యక్రమాన్ని వైసీపీ నేతలు విజయవంతం చేయగా టిడిపి కార్యక్రమం విఫలమవ్వటం పట్ల చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారట. ఇపుడు సిద్ధం చేస్తున్న జాబితా ప్రకారమే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు ఉంటుందని పార్టీలో ప్రచారం జరుగుతోంది.
అంతేకాకుండా పలు నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను కూడా మార్చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా చెప్పిన విషయం గుర్తుందికదా? అయితే ఇపుడు విఫలమైన నేతలందరికీ వచ్చే ఎన్నికల్లో టెక్కట్లు నిరాకరించే పరిస్ధితి ఉంటుందా అన్నదే సందేహం. మరి, చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.