
అరచేతిలో స్వర్గాన్ని చూపటంలో చంద్రబాబునాయుడును మించినవారు లేరు. ఈ విషయం ఎన్నో సార్లు రుజువైంది కూడా. తాజాగా చంద్రబాబు మాటలు అలానే ఉన్నాయి. నవనిర్మాణ దీక్ష ముగింపు సందర్భంగా కాకినాడలో చంద్రబాబు మాట్లాడుతూ, 2050కి ఏపినే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతానంటున్నారు. 2050 అంటే ఇంకో 33 ఏళ్ళ తర్వాత. రేపేమవుతుందో ఎవరూ చెప్పలేరు. జనరేషన్ గ్యాప్ అంటే 30 ఏళ్ళు. అటువంటిది 33 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో ఎవరు చూడొచ్చారు?
2029 నాటికి దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా చేస్తారట. 2050కన్నా ఇది నయం కదూ జరిగిందో లేదో మనమే చూడొచ్చు. జనాలకు కావాల్సింది ఈరోజు ఏంటి అనే. ఎందుకంటే, మూడేళ్ళ క్రితం అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చిన రుణమాఫీలు పూర్తిగా అమలు కాలేదు.
నిరుద్యోగభృతి ఇంతవరకూ లేదు. కాపులను బిసిల్లో చేర్చేలేదు, ప్రపంచస్ధాయి రాజధాని అమరావతికి ఇంతవరకూ మాస్టర్ ప్లానే సిద్ధం కాలేదు. అత్యున్నత సాంకేతిక నైపుణ్యంతో వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలు ఎంత నాణ్యతగా ఉన్నాయో కళ్ళకు కనబడుతూనే ఉంది.
2022కు దేశంలోని మూడు రాష్ట్రాల్లో ఒకటిగా చేసి తలసరి ఆదాయం రూ. 3 లక్షలకు పెంచుతారట. 2029కల్లా తలసరి ఆదాయాన్ని రూ. 10 లక్షలకు, 2050కి రూ. 1.07 కోట్లకు పెంచుతానని మాట ఇస్తున్నారట. ఎలాగుంది హామీలు. బిసిలకు ఇబ్బంది లేకుండా కాపులను అదనపు రిజర్వేషన్లు, నిరుద్యోగ భృతి త్వరలో ఇచ్చి తీరుతారట. జనాలు నమ్మాలట. మొక్కుబడిగా డ్వాక్రా, రైతు రుణమాఫీలు అమలు చేస్తున్నట్లే ఈ హామీలు కూడా ఏదో ఒకరకంగా అమలు చేస్తారేమో లేండి. ఎందుకంటే, మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కదా?