
కొత్త సంవత్సరం జనవరి నెలలోనే నిరుద్యోగభృతిని అమలు చేయాలంటూ ప్రభుత్వం నిర్ణయించిందా? తాజా సమాచారాన్ని బట్టి అవుననే సమాధానం వస్తోంది. నిరుద్యోగభృతి ఇవ్వటమన్నది పోయిన ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఇచ్చిన కీలక హామీల్లో ఒకటి. అయితే, అధికారంలోకి రాగానే తన హామీని చంద్రబాబు పూర్తిగా పక్కనపెట్టేసారు. అయితే, ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూసిన నిరుద్యోగులు చివరకు ఆందోళనలకు దిగారు. దానికితోడు వైసిపి కూడా అదే విషయమై పదే పదే అధికారపార్టీపై దాడులు చేస్తోంది.
అన్నింటికన్నా మించి 2019 ఎన్నికలు ముంచుకొస్తోంది. దాంతో నిరుద్యోగభృతిని అమలు చేయక తప్పని పరిస్ధితిలు కనబడుతున్నాయి. అందుకని ఈ విషయమై చంద్రబాబు కూడా దృష్టి పెట్టారు. ఓ కమిటినీ వేసి అధ్యయనం చేయించారు. మొత్తానికి సుమారు 12 లక్షల మందికి నిరుద్యోగ భృతిని అమలు చేయాల్సి వస్తుందని ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. వీరిలో ఇంటర్మీడియట్ విద్యార్ధుల నుండి పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్ధుల వరకూ ఉంటారు. రూ. వెయ్యి, రూ. 2 వే చొప్పున నిరుద్యోగభృతి ఇవ్వాలన్నా ప్రభుత్వంపై సుమారు వెయ్యి కోట్ల వరకూ ఖజానాపై భారం పడుతుందని ఓ అంచనా.
సరే, రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే వచ్చే జనవరి 12వ తేదీనుండి తానిచ్చిన హామీని అమల్లోకి తీసుకురావాలని చంద్రబాబు దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్లే. అదే విషయాన్ని యువజన సర్వీసుల శాఖమంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. జనవరి 12న స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని నిరుద్యోగ భృతిని వర్తింపచేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. నిరుద్యోగ భృతి ఇవ్వటంతో పాటు ఆసక్తి ఉన్న వారికి, అర్హులకు వృత్తి విద్యల్లో శిక్షణ కూడా ఇప్పించాలని అనుకుంటోందట. త్వరలో ఈ విషయమై ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటిస్తుందని మంత్రి కొల్లు చెప్పారు.