కొనసీమలోని మూడు మండలాలకు ఇంటర్ నెట్ పునరుద్ధరణ.. ఇప్పటివరకు 71 మంది అరెస్ట్..

Published : Jun 01, 2022, 11:39 AM ISTUpdated : Jun 01, 2022, 11:56 AM IST
కొనసీమలోని మూడు మండలాలకు ఇంటర్ నెట్ పునరుద్ధరణ.. ఇప్పటివరకు 71 మంది అరెస్ట్..

సారాంశం

కొనసీమ జిల్లాలో ఇంటర్ నెట్ సేవలను గత వారం రోజులుగా నిలిపివేశారు. దీంతో వర్క్ ఫ్రమ్ చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, బ్యాంకింగ్ సేవలపై ఆధారపడిన వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.   

కోనసీమ జిల్లా పేరును మార్చవద్దని కోరుతూ నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొనసీమ జిల్లాలో ఇంటర్ నెట్ సేవలను గత వారం రోజులుగా నిలిపివేశారు. దీంతో వర్క్ ఫ్రమ్ చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, బ్యాంకింగ్ సేవలపై ఆధారపడిన వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిజిటిల్ లావాదేవీలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. గ్రామ సచివాలయాల్లో కూడా డిజిటల్ ఆధారిత పనులు నిలిచిపోయాయి. 

ఈ క్రమంలోనే పలువురు ఇంటర్ నెట్ వినియోగించుకోవడానికి గోదావరి తీరానికి క్యూ కడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వైపు లంకలు దాటుతున్నారు. మొబైల్స్ సిగ్నల్స్ అందుతున్న చోటుకు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. కొందరు తాళ్లరేవు, కాకినాడ, రాజమహేంద్రవరం, యానాం తదితర ప్రాంతాలకు వెళ్లి ఇంటర్‌నెట్‌ సేవలను వినియోగించుకుంటున్నారు. ఇందుకోసం లాడ్జీలు, తాత్కాలిక షెల్టర్లలో మకాం వేశారు. వీరంతా కోనసీమలో ఇంటర్ నెట్ సేవలను పునరుద్దరించాలని కోరుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కోనసీమలో ఇంటర్ నెట్ సేవలు పునరుద్ధరించలేక పోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ  పాలనకు నిదర్శనం అని విమర్శలు చేశారు.

అయితే సోషల్‌ మీడియాలో పుకార్ల నియంత్రణ కోసమే ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేసినట్టుగా అధికారులు చెబుతున్నారు. ఇంటర్నెట్‌ సేవలను మరో 24 గంటలు పొడిగించినట్లు కోనసీమ జిల్లా ఎస్పీ కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి తెలిపారు. అయితే కొనసీమ జిల్లాలోని మొత్తం 16 మండలాల్లో.. 3 మండలాలకు మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. సఖినేటిపల్లి, మలికిపురం, ఐ.పోలవరం మండలాల్లో ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరించినున్నట్టుగా వెల్లడించారు. మిగిలిన మండలాల్లో బుధవారం కూడా ఇంటర్నెట్‌ ఉండదన్నారు. ఇక, ఇంటర్ నెట్ సేవలు నిలిచిపోయిన నేపథ్యంలో వాలంటీర్లు బయోమెట్రిక్ లేకుండానే.. రేషన్, పించన్ పంపిణీ చేపడుతున్నారు. 

ఇప్పటివరకు 71 మంది అరెస్ట్..
కొత్తగా ఏర్పాటైన కోనసీమ జిల్లా పేరును బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ మే 24న అమలాపురంలో పెద్ద ఎత్తున అల్లర్లు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అమలాపురంలో అల్లర్ల ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. పలువురుని అరెస్ట్ చేస్తున్నారు. సీసీటీవ ఫుటేజ్, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్న పోలీసులు.. నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా మంగళవారం మరో తొమ్మది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మొత్తం అరెస్ట్‌లు 71కి చేరుకున్నాయని జిల్లా ఎస్పీ కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి చెప్పారు.

తాజాగా అరెస్టు చేసిన 9 మందిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌ విధించారని పేర్కొన్నారు. నిందితులను పూర్తి ఆధారాలతో గుర్తించే అరెస్ట్‌ చేస్తున్నామన్నారు. అమలాపురంలో 144 సెక్షన్, సెక్షన్‌ 30 ఇంకా అమలులోనే ఉన్నాయని చెప్పారు. ఇక, అమలాపురంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నప్పటీ నుంచి జిల్లాలో ఇంటర్ నెట్ సేవలను నిలిపివేశారు.

PREV
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu