
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో యువతీ యువకుల సమస్యలను అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రస్తావించారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వైసిపి ప్రభుత్వ పాలనలో అవకాశాలు లేక బ్రతుకు భారంగా మారడంతో యువత ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని లోకేష్ పేర్కొన్నారు.
''ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు యువతకు అంతర్జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగుదేశం పాలనలో తెలుగు యువత ఎన్నో అద్భుత అవకాశాలను అందుకుంది. దేశ విదేశాల్లో తన సత్తా చాటింది. అలాంటి యువశక్తిని రెండేళ్ళ జగన్ పాలన తీవ్రంగా నిరుత్సాహపరిచింది'' అని లోకేష్ అన్నారు.
read more సీఎం జగన్ గారు... నాకు న్యాయం చేయండి: కృష్ణా జిల్లా మహిళ ఆవేదన (వీడియో)
''మాస్క్ పెట్టుకోలేదని ఒకరిని, దొంగతనం ఒప్పుకోలేదని ఒకరిని, జగన్ రెడ్డిని ప్రశ్నించాడని ఒకరిని ఈ ప్రభుత్వం బలితీసుకుంది. ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంటే తట్టుకోలేని యువత ఆత్మహత్యలు చేసుకుంటోంది. ఉద్యోగాలు లేక బతుకు మీది భయంతో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు'' అని ఆవేదన వ్యక్తం చేశారు.
''యువ ముఖ్యమంత్రి అని ఆశపడిన యువతకు బతుకులేకుండా చేస్తున్నారు. ఇప్పటికైనా యువతకు ఇచ్చిన హామీలు చిత్తశుద్ధితో అమలు చెయ్యాలి'' అంటూ ట్విట్టర్ ద్వారా వైసిపి ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను డిమాండ్ చేశారు మాజీ మంత్రి నారా లోకేష్.