నిత్యం మద్యం తాగి వేధిస్తున్నాడని ఓ భార్య ఘాతుకానికి ఒడిగట్టింది. భర్త మెడకు చున్నీ బిగించి హత్య చేసింది. ఆ తరువాత ఏమీ తెలీనట్టు ఆత్మహత్య చేసుకున్నాడంటూ లబో దిబో మంటూ ఏడవడం ప్రారంభించింది.
అమరావతి : వేధింపులకు గురిచేస్తున్న భర్తను భార్య కడతేర్చిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని జుజ్జూరు గ్రామంలో ఈ నెల ఐదో తేదీన షేక్ బాజీ అనే వ్యక్తిని ఆయన భార్య ఖాసింబీ హత్య చేసింది. మరుసటి రోజు ఉదయం తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించేందుకు ప్రయత్నించింది.
మృతుడి తమ్ముడు ఖాశీం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో విచారించారు. ఈ మేరకు కేసు వివరాలను డీఎస్పీ నాగేశ్వరరెడ్డి బుధవారం వెల్లడించారు. ఫూటుగా మద్యం తాగి వచ్చిన బాజీని తన భార్య ఖాసీంబి మెడకు చున్నీ బిగించి ఉరేసిందని తెలిపారు.
నిత్యం మద్యం తాగి వచ్చి తనతో పాటు పిల్లలను తీవ్రంగా కొడుతూ తన భర్త హింస పెట్టేవాడని ఖాసింబి తెలిపింది. ఈ వేధింపులు తట్టుకోలేకనే హత్య చేశానని పేర్కొంది. ఖాసింబిని సీఐ నాగేంద్రకుమార్ అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకుందని చెప్పారు. ఖాసీంబి, బాజీకి ఇద్దరు కుమార్తెలున్నారు.
తండ్రి మృతి చెందగా తల్లి హత్య కేసులో జైలుకు వెళ్లటంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇద్దరు పదేళ్ల లోపు వయసు చిన్నారులు కావటంతో తల్లి కోసం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎస్‌ఐ సోమేశ్వరరావు పాల్గొన్నారు.