వైయస్ హయాంలో ఆ మంత్రుల కాంబినేషన్ సెంటిమెంట్: మరింత బూస్ట్ ఇస్తూ అదేబాటలో జగన్

Published : Jun 08, 2019, 09:13 PM IST
వైయస్ హయాంలో ఆ మంత్రుల కాంబినేషన్ సెంటిమెంట్: మరింత బూస్ట్ ఇస్తూ అదేబాటలో జగన్

సారాంశం

అయితే 2024 ఎన్నికల్లో కూడా మళ్లీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రచారం చేసుకుంటున్నారు. 2004లో 2009లో ఎలా అయితే ఆనాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఎలా అయితే అధికారంలోకి వచ్చిందో మళ్లీ వైయస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆ సెంటిమెంట్ పునరావృతం అవుతందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.  

విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలనలో తన మార్క్ చూపిస్తూనే ఉన్నారు. ప్రతీ అంశంలో తన మార్క్ కనిపించాలని చూస్తున్న జగన్ తండ్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డిని ఫాలో అవుతూనే ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో హమీ ఇచ్చినట్లుగా రాజన్న రాజ్యం కోసం రాజన్నను మరిపిస్తున్నారు. 

ఇకపోతే తన తండ్రి దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏ సెంటిమెంట్ లకు అయితే విలువ ఇచ్చారో అదే సెంటిమెంట్ లను పాటిస్తూ వాటికి విలువలు ఇస్తున్నారు వైయస్ జగన్. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వైయస్ రాజశేఖర్ రెడ్డికి ప్రత్యేక సెంటిమెంట్ ఉండేదట. 

ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విజయనగరం జిల్లాలో తనకంటూ ఒక టీంను తయారు చేసుకున్నారు వైయస్ఆర్. తనకు అత్యంత సన్నిహితుడుగా బొత్స సత్యనారాయణను రాజకీయాల్లో ప్రోత్సహించారు. అలాగే చినమేరంగి సంస్థానానికి చెందిన శత్రుచర్ల విజయరామరాజును కూడా వైయస్ఆర్ ప్రోత్సహించారు. 

విజయనగరం జిల్లా నుంచి శత్రుచర్ల విజయరామరాజు, బొత్స సత్యనారాయణ అనతికాలంలోనే వైయస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా మారిపోయారు. ఈ నేపథ్యంలో వారికి రెండు సార్లు తన కేబినెట్ లో స్థానం కల్పించారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. 

2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా తొలిసారిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు తన కేబినెట్ లో బొత్స సత్యనారాయణకు, శత్రుచర్ల విజయరామరాజుకు మంత్రి వర్గంలో స్థానం కల్పించారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. బొత్స సత్యనారాయణ, శత్రుచర్ల విజయరామరాజు కూడా తొలిసారిగా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారే. 

వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్వతీపురం డివిజన్ లో అభివృద్ధిపనులను మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, విజయనగరం డివిజన్ పరిధిలో బొత్స సత్యనారాయణ చేపడుతూ సమన్వయంతో ముందుకు వెళ్లారట. 

దీంతో జిల్లా అభివృద్ధిలో, కీలక ప్రాజెక్టులను సాధించడంలో జోడెద్దులుగా శత్రుచర్ల, బొత్స పనిచేసేవారని వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇతర మంత్రులు వద్ద కూడా చెప్పుకునేవారట. దాంతో వారి కాంబినేషన్ పై ప్రత్యేక అభిమానం చూపించేవారట వైయస్. 

అయితే 2009 ఎన్నికల్లో నియోజకవర్గ పునర్విభజనలో పార్వతీపురం రిజర్వుడ్ కావడంతో శత్రుచర్ల విజయరామరాజు పరిస్థితి అయోమయంగా మారిందట. వారి కాంబినేషన్ ను కొనసాగించాలని భావించిన వైయస్ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం టికెట్ కేటాయించి మరీ గెలిపించుకున్నారట.  

మళ్లీ ఇద్దరూ గెలవడంతో ఇద్దర్నీ 2009 కేబినెట్లో వైయస్ తన మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. రెండోసారి వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు బొత్స, శత్రుచర్ల కాంబినేషన్ కలిసొచ్చింది ఒక సెంటిమెంట్ లా మారిందంటూ చెప్పుకొచ్చారట. 

అదే సెంటిమెంట్ ఇప్పుడు పునరావృతం చేశారు ఆయన తనయుడు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. 2019 ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైయస్ జగన్ తన కేబినెట్ లో చినమేరంగి సంస్థానం నుంచి కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణికి మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. అలాగే బొత్స సత్యనారాయణకు కూడా మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. 

వైయస్ రాజశేఖర్ రెడ్డి సెంటిమెంట్ ను జగన్ పునరావృతం చేస్తున్నారు. ఆనాడు చినమేరంగి సంస్థానాధీపతి శత్రుచర్ల విజయరామరాజు అయితే నేడు చినమేరంగి సంస్థానం వారసురాలు పుష్పశ్రీవాణిని ఆస్థానంలో తీసుకొచ్చారు. పాముల పుష్పశ్రీవాణి శత్రుచర్ల వారి కోడలు. 

ఇకపోతే పార్వతీపురం డివిజన్ నుంచి పాముల పుష్పశ్రీవాణి ప్రాతినిథ్యం వహిస్తే బొత్స సత్యనారాయణ విజయనగరం డివిజన్ నుంచి ప్రాతినిథ్యం వహించబోతున్నారు. దీంతో జిల్లా వాసులు సైతం గత కాంబినేషన్ మళ్లీ మెుదలైందని చెప్పుకుంటున్నారట. 

అయితే 2024 ఎన్నికల్లో కూడా మళ్లీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రచారం చేసుకుంటున్నారు. 2004లో 2009లో ఎలా అయితే ఆనాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఎలా అయితే అధికారంలోకి వచ్చిందో మళ్లీ వైయస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆ సెంటిమెంట్ పునరావృతం అవుతందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.  

PREV
click me!

Recommended Stories

Bhumana Karunakar Reddy Comments on BR Naidu: బీఆర్ నాయుడుపై భూమన సెటైర్లు| Asianet News Telugu
Pawan Kalyan Visits Kakinada GGH Firecracker Blast Victims | Asianet News Telugu