జనసైనికులకు కిక్కిచ్చే న్యూస్‌: ఎంపీ బాలశౌరి కేంద్ర మంత్రి అయితే పండగే

By Galam Venkata Rao  |  First Published Jun 8, 2024, 3:52 PM IST

ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి 21 లోక్ సభ స్థానాలు గెలుచుకుంది. ఈ విజయం వెనుక జనసేన పాత్ర ఎంతో ఉంది. ఈ విషయాన్ని ప్రధాని మోదీనే స్వయంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో జనసేనకు కేంద్ర కేబినెట్ లో అవకాశం లభించనున్నట్లు తెలుస్తోంది. ఈ అవకాశం సీనియర్ ఎంపీ అయిన వల్లభనేని బాలశౌరికి దక్కనుందని సమాచారం. 


వల్లభనేని బాలశౌరి. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎంపీ. ముచ్చటగా మూడోసారి ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఎన్నికలకు మూడు నెలల ముందు జనసేనలో చేరి.. భారీ మెజారిటీతో విజయాన్ని ముద్దాడారు. దీంతో బాలశౌరి పేరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మార్మోగుతోంది. జనసేన పోటీ చేసిన రెండు స్థానాలు(మచిలీపట్నం, కాకినాడ)లో బాలశౌరి సీనియర్ నేత. అలాగే, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌తో సన్నిహితంగా మెలిగే వ్యక్తి కావడంతో ఇప్పుడు ఆయనపై అంచనాలు పెరిగిపోతున్నాయి. కేంద్ర కేబినెట్‌లో బెర్త్‌ సాధించడం కన్ఫార్మ్‌ అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 

ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసింది. అన్ని స్థానాల్లో విజయం సాధించి.. వంద శాతం స్ట్రైక్‌ రేటు నమోదు చేసి రికార్డుకెక్కింది. రెండు లోక్ సభ స్థానాల్లో ఒకటైన మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి బరిలోకి దిగి.. విజయం సాధించారు. కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి టీ టైమ్‌ ఓనర్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఎంపీగా గెలిచారు. 

Latest Videos

మరోవైపు ఢిల్లీలో జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ప్రధాని మోదీ ఆకాశానికెత్తారు. పవన్‌ వల్లే ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు చారిత్రక విజయం సాధించగలిగారని కొనియాడారు. పవన్‌ అంటే పవనం కాదని, తుఫాన్‌ అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. మోదీ సహా బీజేపీ అగ్రనేతల దగ్గర పవన్ కల్యాణ్‌కు పలుకుబడి బాగానే ఉందని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ మరొకటి అవసరం లేదు.

సాక్షాత్తూ ప్రధాని మోదీకి దగ్గరగా ఉండే పవన్‌ కల్యాణ్‌కు చాలా సన్నిహితంగా ఉంటున్నారు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి. జనసేనలో సీనియర్‌ కావడం, మూడుసార్లు ఎంపీగా గెలవడం, తొలిసారి తెనాలి పార్లమెంటు, 2019లో మచిలీపట్నం ఎంపీగా ఎన్నికై చేసిన అభివృద్ధి, మంచి పనులు బాలశౌరికి ప్లస్‌ పాయింట్స్‌. అలాగే, కేంద్రంలో జనసేనకు ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తే బాలశౌరి పేరు తప్పనిసరిగా పరిగణనలో ఉంటుందనేది విశ్లేషకులు చెబుతున్న మాట. 

 


అభివృద్ధిపైనే గురి... 


బాలశౌరి తెనాలి ఎంపీగా 2005లో ఎన్నికయ్యారు. పార్లమెంట్‌ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు విరివిగా చేపట్టారు. అలాగే, ప్రజా సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగారు. దివిసీమ ప్రాంతమైన అవనిగడ్డ నియోజకవర్గంలో రొయ్యల చెరువుల సాగులో నష్టాలొచ్చి.. అప్పట్లో రైతులు పొలాలను బీడు భూములుగా వదిలేసి వలస వెళ్లిపోయారు. ఇది తెలుసుకున్న ఎంపీ బాలశౌరి దాదాపు 18వేల ఎకరాలను క్రేన్ల సాయంతో తిరిగి సాగుకు యోగ్యంగా మార్చారు. ఇప్పటికీ దీన్ని దివిసీమ రైతులు గొప్పగా చెబుతుంటారు. ప్రజలు గుర్తుంచుకొనేలా తన మార్కు అభివృద్ధి చేయడం బాలశౌరి ప్రత్యేకం. ఇక, 2019లో మచిలీపట్నం నుంచి పోటీ చేసి రెండో దఫా ఎంపీగా గెలిచి.. నియోజకవర్గ అభివృద్ధిలో కీలకమయ్యారు. బందరు (మచిలీపట్నం) పోర్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు, 4వేల కోట్ల రుణం తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు. 
ఇలా చెప్పుకుంటూ పోతే, రూ.350కోట్లతో గుడివాడ ఫ్లైఓవర్‌, రూ.40కోట్ల సీఎస్‌ఆర్‌ నిధులతో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, ఆసుపత్రుల్లో మౌలికసదుపాయాల కల్పన లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు బాలశౌరి చేపట్టారు. ఐదేళ్లలో మచిలీపట్నం ప్రాంత ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. ప్రజల్లో ఇంత మంచి పేరున్న నాయకుడు కేంద్ర మంత్రి అయితే రాష్ట్రానికి, జనసేన పార్టీకి మంచి జరుగుతుంది. ఒక ఎంపీగానే వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిన బాలశౌరి... కేంద్ర మంత్రి అయితే ప్రభుత్వం నుంచి నిధులు అనేక విధాలుగా తీసుకురాగలరు కూడా. కేంద్ర మంత్రులతో ఆయనకున్న సంబంధాలు, ఎన్‌డీయే, జనసేన అధినాయకత్వంతో ఉన్న పరిచయాలు, పలుకుబడి ఇందుకు దోహదపడనున్నాయి. మరోవైపు బాలశౌరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభిస్తే జనసేనలోనూ జోష్‌ పెరుగుతుంది. తెనాలి, మచిలీపట్నంలో ఎంపీగా పనిచేసిన నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఆయన ఫాలోవర్స్‌ ఎక్కువే. ఏదేమైనా సీనియర్‌ ఎంపీ అయిన బాలశౌరికి కేంద్ర కేబినెట్‌ పదవి దక్కితే వచ్చే ఎన్నికల నాటికి జనసేన మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. 

నేపథ్యం ఇదీ...

వల్లభనేని బాలశౌరి.. సెప్టెంబర్ 18, 1968న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా మాచవరం మండలం, మొర్జంపాడు గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు జోజయ్య నాయుడు-తమసమ్మ. ఆయన ప్రాథమిక విద్య, ఉన్నత విద్య గుంటూర్ లోనే సాగింది. ఆ తరువాత ఆయన ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంఏ పూర్తి చేశారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత వ్యాపారాన్ని ప్రారంభించారు. తన వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగారు. ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే భార్య భానుమతి. వారికి ముగ్గురు కుమారులు. వల్లభనేని అనుదీప్, వల్లభనేని అరుణ్, వల్లభనేని అఖిల్. 

రాజకీయ జీవితం...

చిన్ననాటి నుండే రాజకీయాలపై ఆసక్తి ఉన్న బాలశౌరి కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. పార్టీ కార్యక్రమాల్లో ఎంతో చురుగ్గా పాల్గొనేవారు. ఈ క్రమంలో అప్పటి కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి దృష్టిని ఆకర్షించారు. అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుని.. వైఎస్ఆర్‌కు అత్యంత సన్నిహితుడుగా మారాడు. 2019లో వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2024లో ఈసారి జనసేన తరఫున బరిలోకి దిగి ఎంపీగా ఎన్నికయ్యారు.

click me!