ఏపీలో కాంగ్రెస్ వేగంగా పుంజుకుంటున్నది. తెలంగాణలో స్వల్ప సమయంలోనే అధికారాన్ని దక్కించుకున్నట్టుగా ఏపీలో ఉనికిలోనే లేని కాంగ్రెస్ పార్టీ ఓ మోస్తారుగా సీట్లు సాధిస్తే మాత్రం చక్రం తిప్పే అవకాశాలు లేకపోలేవు. ఎక్కువ సీట్లు రాబట్టి హంగ్‌కు కారణమైతే అది వైసీపీకే కాదు.. టీడీపీకి కూడా సవాలుగానే ఉంటుంది.
CM Jagan: ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటున్నది. మొన్నటి వరకు ఏపీ కాంగ్రెస్ దాదాపు సుప్తావస్తలోకి వెళ్లింది. క్యాడర్ నిరుత్సాహంలోకి వెళ్లింది. పలువురు కీలక నాయకులు పార్టీ మారారు. ఏపీలో ఇక కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందనీ అనుకున్నారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉండేది. కానీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. బీఆర్ఎస్ తర్వాత.. ఆదరణ బీజేపీకే ఉంటుందని అప్పటి వరకు అనుకున్నారు. కానీ, ఏకంగా అధికారాన్నే దక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ.
తెలంగాణ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సారథ్యంలో వెళ్లిన కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాల్లో పకడ్బందీగా వ్యవహరించింది. టికెట్ల కేటాయింపు వ్యవహారం.. సీనియర్ల మధ్య విభేదాలను సద్దుమణిగించడం, బహిరంగంగా సీరియస్ కామెంట్స్ చేయడం, క్యాంపెయిన్ ప్లాన్ అన్నీ.. కూడా పకడ్బందీగా సాగింది. అంతేకాదు, రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానం అన్ని రకాలుగా సహాయపడింది. అంతకు ముందే గెలిచిన కర్ణాటక కాంగ్రెస్ నుంచి కూడా ఆదరణ దక్కింది. పలుమార్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లు ఇక్కడికి వచ్చి ప్రచారం చేశారు.
ఇదే ఫార్ములాను ఏపీలో కూడా అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఏపీలో కాంగ్రెస్ సభలకు షర్మిలకు దన్నుగా తెలంగాణ సీఎం, కర్ణాటక నుంచి కూడా ముఖ్యమైన కాంగ్రెస్ నేతలను దింపనున్నట్టు సమాచారం. తద్వార ఉనికిని వెల్లడించడమే కాదు.. మంచి సంఖ్యలో స్థానాలను గెలుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నది.
Also Read : Wedding: గల్ఫ్‌లో జరిగిన పెళ్లి.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను ఒక్క చోటికి తెచ్చింది! ఇంతకీ వారెవరు?
ఏపీలో వైసీపీ, టీడీపీలు బలమైన పార్టీలు. జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల క్యాడర్, ఓటు షేరు స్వల్పమే. కానీ, టీడీపీతో జతకట్టి జనసేన కూడా ఈ సారి ఎన్నికల్లో సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై ఈ పార్టీలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి రావడంతో కొంత వ్యతిరేకత సహజంగానే ఏర్పడింది. మార్పు రావాలనే నినాదంతో కాంగ్రెస్ సరైన దారిలో దూసుకెళ్లింది. ఏపీలో జగన్ ఒకే సారి అధికారంలోకి వచ్చారు. పరిపాలనపై ముఖ్యంగా అభివృద్ధి చేయలేదని, రాజధాని నిర్మించలేదనే విమర్శలు ఉన్నప్పటికీ.. యూనివర్సల్‌గా అందరికీ అందే సంక్షేమ పథకాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పార్టీని పటిష్టం చేసుకున్నారు. ఇవే ఆయనకు ప్రధానంగా ఈ ఎన్నికల్లో కలిసి రానున్నాయి.
కాబట్టి, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. వైసీపీ, టీడీపీలు ప్రధానంగా తలపడుతున్నా.. కాంగ్రెస్ కూడా వేగంగా పుంజుకుంటున్నది. ఒక వేళ కాంగ్రెస్ నామమాత్రంగా కాకుండా ఓ మోస్తారుగా సీట్లు గెలుచుకుంటే మాత్రం అది వైసీపీకే కాదు.. టీడీపీకి కూడా ఇబ్బందికరంగానే మారొచ్చు. ఒక వేళ ఏ పార్టీకీ మెజార్టీ రాకుండా హంగ్ వస్తే మాత్రం.. ఏపీ కాంగ్రెస్ సుడి తిరిగే అవకాశాలు లేకపోలేవు. హంగ్ అనేది.. వైసీపీకే కాదు.. టీడీపీ-జనసేనకు కూడా సవాలే అని విశ్లేషకులు చెబుతున్నారు.