
ఉండవల్లి : ఎన్నికల వేళ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దైవ అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు చేపట్టారు. ఇవాళ(శుక్రవారం) ఉండవల్లిలోని ఆయన నివాసంలో రాజశ్యామల యాగం మొదలయ్యింది. ఈ యాగ క్రతుల్లో చంద్రబాబు-భువనేశ్వరి దంపతులు పాల్గొన్నారు. మూడు రోజులపాటు ఈ రాజశ్యామల యాగం జరగనుంది.
చంద్రబాబు దంపతులు అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి యాగాన్ని ప్రారంభించారు. 50 మంది రుత్వికులు అత్యంత నిష్టతో ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. శుక్ర, శని, ఆదివారాలు పలు రకాల పూజలు, యాగ క్రతులు నిర్వహించనున్నారు. ఆదివారం పూర్ణాహుతితో యాగం ముగియనుంది.
ఇటీవల ఇలాగే ఉండవల్లి నివాసంలో చంద్రబాబు దంపతులు మూడు రోజులపాటు మహా చండీయాగం, సుదర్శన నారసింహ హోమం చేపట్టిన విషయం తెలిసిందే. గతేడాది చివర్లో గుంటూరుకు చెందిన శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో 40 మంది రుత్వికులతో ఈ యాగం నిర్వహించారు. ఇందులో టిడిపి నాయకులు, వారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
ఎన్నికల వేళ చంద్రబాబు పూజలు చేపట్టడం పార్టీ విజయం కోసమేనని తెలుస్తోంది. తమ ప్రయత్నానికి దైవ అనుగ్రహం తోడయితే విజయం వరిస్తుందని ఆయన నమ్ముతున్నారు. అందువల్లే వరుసగా పూజలు, యాగాలు చేయిస్తున్నారు.
అసలేంటి రాజ శ్యామల యాగం? చేయడం వల్ల కలిగే లాభాలేంటి?
చరిత్రలో గొప్ప గొప్ప రాజులు తమ రాజ్యం, రాచరికం శాశ్వతంగా వుండేందుకు రాజసూయ యాగం చేసేవారట. హిందూ పురాణాల్లో ఈ యాగం గురించి ప్రస్తావించారు. పాండవుల్లో పెద్దవాడయిన ధర్మరాజుతో శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా ఈ యాగాన్ని చేయించినట్లు మహాభారతం చెబుతోంది. ఇలా పూర్వకాలంలో రాజులు చేసిన రాజసూయ యాగం లాంటిదే రాజశ్యామల యాగం కూడా అని పండితులు చెబుతున్నారు.
రాజ్యలక్ష్మి వరించాలని అంటే రాజకీయ బాషలో చెప్పాలంటే ఎన్నికల్లో విజయం సాధించాలని చేసే యాగమే రాజశ్యామల యాగం. అధికారంలో వున్న పార్టీలు మరోసారి గెలవాలని... ప్రతిపక్ష పార్టీలు అధికారంలోకి రావాలని ఈ యాగం చేస్తుంటారు. తమ ప్రయత్నానికి అమ్మవారి అనుగ్రహం తోడయితే విజయం సిద్దిస్తుందని నమ్మేవారు ఈ యాగం చేస్తుంటారు.
రాజశ్యామల యాగం మండలం రోజులు అంటే 41 రోజులు చేయవచ్చు లేదంటే 21,16, 3 రోజులు కూడా చేయవచ్చని పండితులు చెబుతున్నారు. పూర్ణాహుతి సమర్ఫణతో ఈ యాగం ముగుస్తుంది. ఈ యాగం వల్ల తమ బలం పెరిగి ప్రత్యర్థి బలం తగ్గుతుందని విశ్వసిస్తారు. రాజశ్యామల యాగం ఏడాదిలో ఎప్పుడయినా చేయవచ్చు... కానీ నియమ నిష్టలతో చేయాలని యాగక్రతులు నిర్వహించే రుత్వికులు చెబుతుంటారు.