I-PAC: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kisor)తో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీ అనంతరం ఐ-పాక్(I-PAC) కీలక ప్రకటన చేసింది. ఇంతకీ ప్రకటనలోని అంతర్యమేంటీ?
I-PAC: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత ఎన్నికల్లో వైసీపీ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్(Prashant Kisor) చంద్రబాబు(Chandrababu)తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీ అనంతరం ఐ-పాక్(I-PAC) కీలక ప్రకటన చేసింది. 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) గెలుపు కోసం తాము పనిచేస్తున్నట్టు ఐపాక్ సంస్థ ప్రకటన ద్వారా తెలియజేసింది. ట్విట్టర్ (ఎక్స్) వేదికగా..‘ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి కోసం అనునిత్యం కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు మా వంతు సహయం చేస్తాం. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ(YSRCP)తో కలిసి పనిచేస్తున్నాం. 2024 ఎన్నికల్లో సీఎం జగన్ గెలుపు కోసమే పనిచేస్తాం’అని స్పష్టం చేసింది.
ఇదిలావువుంటే.. ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రశాంత్ కిషోర్ తో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వీరి భేటీ కావడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. శనివారం మధ్యాహ్నం నారా లోకేశ్ తో కలిసి వ్యూహ్యకర్త ప్రశాంత్ కిషోర్ గన్నవరం విమానాశ్రయానికి బయలు దేరారు. అనంతరం వీరిద్దరూ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకుని చంద్రబాబుతో భేటీ అయ్యారు. వీరి భేటీ సూమారు గంటన్నర పాటు జరిగింది.ఈ క్రమంలో ఏపీలో రాజకీయ పరిస్థితులపై ఇరువురు చర్చించినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. అలాగే.. ప్రశాంత్ కిషోర్ బృందం చేసిన సర్వే రిపోర్ట్‌ను చంద్రబాబుకు అందించినట్లు ప్రచారం జరుగుతోంది.
గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపులో ప్రశాంత్ కిషోర్ కీలకంగా వ్యవహరించారు. ఆ ఎన్నికల్లో ఐ ప్యాక్ సంస్థ తరఫున ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరించారు. ఆ తర్వాత బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీకి పనిచేశారు. అనంతరం జరిగిన పరిణామాల తరువాత ప్రశాంత్ కిషోర్.. ఐప్యాక్ నుంచి నిష్క్రమించారు. బీహార్‌లో సొంతంగా రాజకీయ కార్యచరణకు పూనుకున్నారు. ఏదిఏమైనా ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం మాత్రం ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామమేనని చెప్పాలి.
ఈ తరుణంలో మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు పీకేల (ప్రశాంత్ కిషోర్,పవన్ కల్యాణ్ ) వల్ల టీడీపీ(TDP) బ్రతికే పరిస్థితులు లేవన్నారు. చనిపోయిన తెలుగుదేశం పార్టీకి పోస్టుమార్టం చేయడానికి మాత్రమే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పనికొస్తారు గానీ, టీడీపీకి ప్రాణం పోయడానికి పనికిరాడని ఎద్దేవా చేశారు.
తమ రాజకీయ భవిషత్తు కోసం.. తండ్రి కొడుకులు(చంద్రబాబు-లోకేశ్)ఎంతటి నీచానికైనా దిగజారుతారనీ, ఈ భేటీ వారి పరిస్థితికి నిదర్శనమని అన్నారు. గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్‌ను "బీహార్ డెకాయిట్" అని చంద్రబాబు విమర్శించారని గుర్తుకు చేశారు. ‘మేటిరియల్ బాగా లేకపోతే మేస్త్రి మాత్రం ఏం చేస్తారు?’ అని ఎద్దేవా చేశారు. ఎంత మంది కట్టకట్టుకొని వచ్చినా, ఎన్ని వ్యూహాలు రచించినా టీడీపీ గెలవడం అసాధ్యమన్నారు. వ్యూహకర్తలు మారినంత మాత్రాన ఆ పార్టీ భవిష్యత్తు మారదని విమర్శించారు.