నేను కలవలేదు, కేసీఆర్ ను తగ్గించడమే: జగన్

By pratap reddyFirst Published Jan 7, 2019, 1:44 PM IST
Highlights

ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ కేసీఆర్ మీద తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఒక మనిషి సినిమాకు పోతాడని, అందులో హీరో క్యారెక్టర్‌ అంటేనే ఇష్ట పడతాడని, విలన్‌ క్యారెక్టర్‌ నచ్చదు. సినిమా చూసినంతసేపు హీరోనే గెలవాలని చూస్తాడని ఆయన వివరించారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును తాను ఇంత వరకు కలవలేదని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మొన్న కేసీఆర్ గెలిచిన తర్వాత ఫోన్‌లో మాట్లాడి కంగ్రాచ్యులేట్‌ చేశానని ఆయన అన్నారు. ఇందులో తప్పేముందని ప్రశ్నిస్తూ అంతకన్నా కేసీఆర్‌తో తనకు పరిచయం లేదని అన్నారు. 

ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ కేసీఆర్ మీద తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఒక మనిషి సినిమాకు పోతాడని, అందులో హీరో క్యారెక్టర్‌ అంటేనే ఇష్ట పడతాడని, విలన్‌ క్యారెక్టర్‌ నచ్చదు. సినిమా చూసినంతసేపు హీరోనే గెలవాలని చూస్తాడని ఆయన వివరించారు. ఎందుకంటే ఆ మనిషి నైజాన్ని, క్యారెక్టర్‌ను బట్టి అలా చూస్తాడని అన్నారు. 


"చంద్రబాబు నైజం, క్యారెక్టర్‌ దేశ ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇంకా దగ్గరగా చూశారు. కేసీఆర్‌ కూడా దగ్గరగా చూసిన వ్యక్తి కాబట్టి కేసీఆర్‌ చంద్రబాబుపై అలా మాట్లాడి ఉండచ్చు" అని జగన్ అన్నారు. 

ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలంటే ప్రత్యేక హోదా అవసరమని, దాని విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌లు మోసం చేశాయని, ఆంధ్రప్రదేశ్‌లోని పవన్‌ కళ్యాణ్‌ కూడా మోసం చేశాడని, ఇంత మంది మోసం చేసినా కూడా కేసీఆర్‌కు ఆంధ్రప్రదేశ్‌తో సంబంధం లేదని అన్నారు. 

అయినా కూడా "తెలుగు ప్రజల కోసం ఒకడుగు ముందుకేస్తాను, అవసరమైతే హోదా ఇవ్వాలని ప్రధానికి కూడా లేఖ రాస్తాన"ని కేసీఆర్‌ ముందుకొచ్చి నాలుగు మాటలు మాట్లాడాడని ఆయన అన్నారు. అటువంటి మంచి మాటలు మాట్లాడిన వ్యక్తిని మనం స్వాగతించాలని అన్నారు. కేసీఆర్‌కు, బీజేపీ, కాంగ్రెస్‌కు ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద బలమేమీ లేదన్న విషయం అందరికీ తెలిసిందేనని, కానీ ప్రత్యేక హోదా కోసం ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలు 25 మంది స్వరం విన్పించడం ఒక ఎత్తు. వారికి తెలంగాణకు చెందిన ఎంపీలు 17 మంది మద్దతు పలకడం మరొక ఎత్తు అని అన్నారు. 

తెలంగాణఛ ఎంపీలు కూడితే 42 మందిమి ఏకమై ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండని అడిగితే అది ఇంకొక ఎత్తు అని, ఆ దశకు ఎదిగితే ఆంధ్ర రాష్ట్రానికి జరిగే మేలు అంతకంటే మరొకటి ఉండదని అన్నారు. ఇందులో హామీ అనేది ఆయనే మీడియా ఛానళ్లలో చెప్పారని జగన్ చెప్పారు. కేసీఆర్‌ కూతురు, ఎంపీ కవిత పార్లమెంట్‌లోను ఏపీకి హోదా ఇవ్వాలని కోరారని గుర్తు చేశారు.

కేసీఆర్‌కు ఒకరి సపోర్టు అవసరం లేదని, జగన్‌ సపోర్టుతో ఆయన గెలిచారని చెప్పడం కూడా కేసీఆర్‌ను తగ్గించినట్టు అవుతుందని జగన్ అన్నారు. తెలంగాణలో ఒక పార్టీకి సపోర్టు చేయమని తాము పిలుపునివ్వలేదని, ఎందుకంటే అక్కడి ప్రజలు ఎవరికి ఓటెయ్యాలనేది, ఎవరి వల్ల మేలు జరుగుతుందో చూసుకుని ఓటేసేలా వారి మనస్సాక్షికి వదిలేశామని స్పష్టం చేశారు. 

అయితే సహజంగానే నాన్నగారిని ప్రేమించే వ్యక్తులు, తమ పార్టీని ప్రేమించే వ్యక్తులకు టీడీపీతో కూడిన కాంగ్రెస్‌ పార్టీకి ఓటెయ్యాలంటే చెయ్యిపోదని, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా టీడీపీతో పోరాడిన కాంగ్రెస్‌.. అదే టీడీపీతో కలిసి పోటీ చేయడం. దీంతో సహజంగా టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటేసి ఉంటారని జగన్ విశ్లేషించారు. 

సంబంధిత వార్త

పవన్ కల్యాణ్ మీద వైఎస్ జగన్ అంచనా ఇదీ...

click me!