భార్యకు శారీరక, మానసిక వేధింపులు.. భర్తకు మూడేళ్ల జైలు, పదివేల జరిమానా..

By Bukka SumabalaFirst Published Aug 13, 2022, 11:20 AM IST
Highlights

భార్యను శారీరకంగా, మానసికంగా వేధించినందుకు ఓ వ్యక్తికి ఏలూరు కోర్టు మూడేళ్ల జైలు, పదివేల రూపాయల జరిమానా విధించింది. 

ఏలూరు : భార్యను శారీరకంగా, మానసికంగా వేధించిన భర్తకు న్యాయమూర్తి మూడేళ్ల జైలు శిక్ష, రూ.పది వేలు జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు నిచ్చారు. ఏలూరు పోలీస్స్టేషన్ డిఎస్పి సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం నాయుడుపేటకు చెందిన పెద్దింటి రమేష్ కు పెదివేగి  మండలం కరణంగారి తోటకు చెందిన పద్మలతకు కొన్నేళ్ల కిందట వివాహమయ్యింది. భర్త, అతని కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని  బాధితురాలు 2020లో దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అప్పట్లో రమేష్ ను అరెస్టు చేశారు. ఏలూరు కోర్టులో శుక్రవారం తుది విచారణ జరిగింది. నేరం రుజువు కావడంతో నిందితుడికి మూడేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తూ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ పూలతోటి దివాకర్ తీర్పునిచ్చారు. దీంతోపాటు బాధితురాలు పద్మలత కు రూ.20వేలు పరిహారం మంజూరు చేశారు. ప్రాసిక్యూషన్ తరఫున హేమలత వాదించారు. ఈ కేసులో మరో ఇద్దరు ఉండగా.. నేరం రుజువు కానందున వారిపై కేసు కొట్టి వేస్తున్నట్లు తెలిపారు.

గోరంట్ల మాధవ్ కు 500 కార్లతో స్వాగతమా? ఇలా చేస్తేనే దేశమంతా మీ వైపే చూస్తారు... ఎంపీ రఘురామ ఎద్దేవా..

ఇదిలా ఉండగా, హైదరాబాద్ కు చెందిన 28 ఏళ్ల బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆమె భర్త అయిన ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగి సుదీప్ మీద కర్ణాటకలోని బెంగళూరు బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనికి కారణం అదనపు కట్నం వేధింపులతో పాటు డ్రగ్స్ మత్తులో ఆమెకు నరకం చూపించాడు. ఆ యువతికి-సుదీప్ కు  2021లో పెళ్లి జరిగింది. వరుని కుటుంబం డిమాండ్ మేరకు వధువు కుటుంబీకులు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో వైభవోపేతంగా పెళ్లి జరిపించారు. 

పెళ్లి సమయంలో రూ. 55 లక్షల విలువచేసే మినీ కూపర్ కారు, 200 కిలోల వెండి, 4 కిలోల బంగారు ఆభరణాలను సుదీప్ కు ముట్ట చెప్పారు. కట్నం, పెళ్లి ఖర్చులు కలిపి రూ. 6 కోట్లు అయినట్లు తెలిపింది. అయితే, ఇంత గ్రాండ్ గా పెళ్లి చేసి ఇన్ని కట్నకానుకలు ఇచ్చినా అతడిలో అసంతృప్తి తగ్గలేదు. పెళ్ళైన కొద్ది రోజులకే.. వీటితో సంతృప్తి చెందని భర్త సుదీప్, పుట్టింటి నుంచి మరింత డబ్బు తేవాలని భార్యను వేధించాడు. దీంతో యువతి తండ్రి తమ రెండు కంపెనీలను అల్లుని పేరిట రాశారు. ఆ కంపెనీలో వచ్చే లాభం సుదీప్ తీసుకునేవాడు. 

ఈ క్రమంలో సుదీప్ డ్రగ్స్ కు బానిస అయ్యాడు. స్నేహితులను ఇంటికి పిలిపించుకుని డ్రగ్స్ తీసుకునేవాడు. ఆ మత్తులో భార్య తలపై మూత్ర విసర్జన చేసి వికృతంగా ప్రవర్తించేవాడు. దీనిని ప్రశ్నిస్తే భార్యను అసభ్యంగా దూషించేవాడు. ఈ విషయాన్ని ఆమె అత్తమామలకు చెప్పుకోగా.. వారు కొడుకునే వెనకేసుకొచ్చారు. పైగా నిన్నే చంపేస్తామని బెదిరించారని ఫిర్యాదులో తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
 

click me!