ఖాళీ చెక్కుపై సంతకం చేసి పంపారు.. ఎస్పీబీపై విశ్వనాథన్ ఆనంద్

By telugu news teamFirst Published Sep 26, 2020, 9:04 AM IST
Highlights

తన కెరీర్ ప్రారంభంలో.. బాల సుబ్రహ్మణ్యమే తనకు మొదటగా స్పాన్సర్ చేసినట్టు తెలిపారు. 1983లో తనకు 14ఏళ్ల వయసు ఉన్నప్పుడు.. తాను ఆడుతున్న చెన్నై కోల్ట్స్ టీమ్.. జాతీయ చెస్ పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు. 
 

గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కరోనా బారిన పడి ఆస్పత్రిలో చేరిన ఆయన.. తిరిగి క్షేమంగా ఇంటికి చేరతారని అందరూ ఆశించారు. కానీ.. ఆయన ప్రమాదవశాత్తు కన్నుమూశారు.  ఈ నేపథ్యంలో.. ప్రతి ఒక్కరూ ఆయనకు పెద్ద ఎత్తున సంతాపాలు వ్యక్తం చేస్తున్నారు.

 ఇదే సమయంలో ఆయనతో గడిపిన క్షణాలను వారు నెమరు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌ కూడా.. చాలా మందికి తెలియని ఓ ఆసక్తికర విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన కెరీర్ ప్రారంభంలో.. బాల సుబ్రహ్మణ్యమే తనకు మొదటగా స్పాన్సర్ చేసినట్టు తెలిపారు. 1983లో తనకు 14ఏళ్ల వయసు ఉన్నప్పుడు.. తాను ఆడుతున్న చెన్నై కోల్ట్స్ టీమ్.. జాతీయ చెస్ పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు. 

ముంబైలో జరుగుతున్న ఈ పోటీలకు వెళ్లేందుకు తమ వద్ద డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో.. తమను బాలసుబ్రహ్మణ్యం ఆదుకున్నారని పేర్కొన్నారు. బాలసుబ్రహ్మణ్యం మిత్రుడు ఒకరు తమ గురించి ఆయనకు చెప్పడంతో.. ‘ఓ ఖాళీ చెక్కుపై సంతకం చేసి మాకు పంపించారు’ అని తెలిపారు. జాతీయ చెస్ పోటీల్లో గెలిచిన అనంతరం తమకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి బాలు హాజరైనట్లు చెప్పారు. ఈ సందర్భంగా..‘ఇక ముందు కూడా మా టీంకు స్పాన్సర్‌గా ఉంటానని బాలసుబ్రహ్మణ్యం గారు మాటిచ్చారు’ అని గుర్తు చేసుకున్నారు. 

click me!