నెల్లూరు కోర్టులో చోరీ:సీబీఐ విచారణపై వేసవి సెలవుల తర్వాతే నిర్ణయమన్న హైకోర్టు

By narsimha lodeFirst Published May 6, 2022, 12:21 PM IST
Highlights


నెల్లూరు కోర్టులో చోరీ ఘటనపై వేసవి సెలవుల తర్వాత నిర్ణయం తీసుకొంటామని ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు స్పష్టం చేసింది. ఈ కేసును సుమోటోగా తీసకొని ఏపీ హైకోర్టు విచారణ చేస్ుంది.

నెల్లూరు: నెల్లూరు కోర్టులో చోరీ ఘటనపై వేసవి సెలవుల తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఏపీ హైకోర్టు ప్రకటించింది.ఈ  చోరీ విషయమై  సీబీఐ విచారణకు అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. మరో వైపు ఈ కేసుకు సంబంధించి విచారణ నివేదికను పోలీసులు ఉన్నత న్యాయస్థానానికి అందించారు.అయితే ఈ విషయమై వేసవి సెలవుల తర్వాత నిర్ణయం తీసుకొంటామని ఉన్నత న్యాయస్థానం శుక్రవారం నాడు ప్రకటించింది.

నెల్లూరు కోర్టులో చోరీ ఘటనపై తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తాను సీబీఐ విచారణకు కూడా సిద్దమని గత మాసంలోనే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.

నెల్లూరు కోర్టులో చోరీ కేసును CBI  విచారణకు అప్పగించినా కూడా తమకు అభ్యంతరం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ హైకోర్టుకు ఈ ఏడాది ఏప్రిల్ 26న తెలిపింది.

ఈ చోరీ ఘటనను AP Hig Court సుమోటోగా తీసుకొని  ఈ ఏడాది ఏప్రిల్ 26న విచారించింది. ఈ కేసు విషయమై సీబీఐ విచారణకు ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని ఏజీ హైకోర్టుకు తెలిపారు. దీంతో సీబీఐ డైరెక్టర్, డీజీపీ, మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిలకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Nellore Court ఆవరణలో చోరీ కేసులో  ఏప్రిల్ 17 ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సయ్యద్ హయత్ , ఖాజా రసూల్ ను అరెస్ట్ చేసినట్టుగా ఎస్పీ  విజయరావు తెలిపారు.కోర్టు ప్రాంగణంలో ఇనుము చోరీ కోసం  వచ్చిన నిందితులు కుక్కలు వెంబడించడంతో కోర్టులోకి వెళ్లినట్టుగా పోలీసులు చెప్పారు.

కోర్టు  తాళం పగులగొట్టి లోపలికి వెళ్లారని ఎస్పీ వివరించారు. కోర్టు లోపల ఉన్న బీరువాలో బ్యాగును తీసుకెళ్లారన్నారు. కోర్టులో చోరీకి గురైన అన్ని వస్తువులను రికవరీ చేశామన్నారు.కోర్టులో నిందితులు తీసుకెళ్లిన బ్యాగ్ నుండి సెల్ ఫోన్, ల్యాప్ టాప్ తీసుకొని మిగిలిన వాటిని నిందితులు పారేశారని ఎస్పీ Vijaya Rao వివరించారు.

నెల్లూరు జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలోని 4వ అదనపు కోర్టులో ఈ ఏడాది ఏప్రిల్ 14న చోరీ జరిగింది.ఈ  చోరీలో పలు కేసులకు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయి. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పై మాజీ మంత్రి Somi Reddy Chandra Mohan Reddy వేసిన కేసుకు సంబంధించిన ఆధారాలు చోరీకి గురయ్యాయని  ప్రచారం సాగుతుంది. ఈ కేసుతో పాటు ఇతర కేసులకు సంబంధించిన ఆధారాలు కూడా చోరీకి గురి కావడం కలకలం రేపుతుంది.

మలేషియా, సింగపూర్, హాంగ్ కాంగ్ లలో సోమిరెడ్డికి ఆస్తులు ఉన్నాయని, పెద్దమొత్తంలో లావాదేవీలు జరిపారని కాకాని గతంలో ఆరోపణలు చేశారు. అంతేకాకుండా, ఇందుకు సంబంధించిన కొన్ని పత్రాలనూ ఇటీవల విడుదల చేశారు. ఆ పత్రాలను మీడియా ముందు కూడా ఉంచారు. అయితే ఆ పత్రాలన్నీ నకిలీవని, తనపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని, ఈ నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. 

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై Kakani Govardhan Reddy విడుదల చేసిన పత్రాలు ఫోర్జరీవిగా పోలీసులు గుర్తించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి  తెచ్చిన డాక్యుమెంట్లు ఫోర్జరీవి అని తేలిందని ఫోరెన్సిక్ లేబోరేటరీ తేల్చింది. అసలు సోమిరెడ్డి మలేషియాకు వెళ్లలేదని ఇమ్మిగ్రేషన్ అధికారులు ధృవీకరించారు. ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో కొందరిని అరెస్టు కూడా చేశారు. ఈ మేరకు పలువురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు చార్జీషీట్ ను కూడా దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను కోర్టులో భద్రపర్చారు. 

click me!