ప్రేమోన్మాది చేతిలో యువతి హతం...హోంమంత్రి సుచరిత సీరియస్

By Arun Kumar PFirst Published Oct 15, 2020, 9:54 PM IST
Highlights

ప్రేమను నిరాకరించిందని తేజస్విని అనే యువతిని నాగేంద్రబాబు అనే వ్యక్తి కత్తితో పొడిచి...తర్వాత తనను తాను గాయపరుచుకోవడం ఉన్మాద చర్య అని హోంమంత్రి సుచరిత మండిపడ్డారు. 

విజయవాడలో యువతిపై ప్రేమోన్మాది ఘాతుకం చాలా బాధాకరమని, ఇటువంటి ఉన్మాద చర్యలను ఉపేక్షించేది లేదని హోంమంత్రి  మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. బాధితురాలి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రేమ పేరుతో బంగారు భవిష్యత్‌ ఉన్న ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థినిని అతి కిరాతంగా దాడి చేసి చంపడం దారుణమన్నారు. ఇటువంటి ఘటనలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హోంమంత్రి హెచ్చరించారు. 

ప్రేమను నిరాకరించిందని తేజస్విని అనే యువతిని నాగేంద్రబాబు అనే వ్యక్తి కత్తితో పొడిచి...తర్వాత తనను తాను గాయపరుచుకోవడం ఉన్మాద చర్య అని మండిపడ్డారు. తల్లిదండ్రులెవరూ లేని సమయంలో నేరుగా తేజస్విని ఇంటికెళ్లి కత్తితో విచక్షణా రహితంగా దాడి చేయడంతో.. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ యువతి మృతి చెందిందన్నారు. మహిళల భద్రత కోసం  ఎన్నో కఠిన చట్టాలు తీసుకువచ్చినా...ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని హోంమంత్రి సుచరిత విచారం వ్యక్తం చేశారు.

read more  బెజవాడలో యువతిపై కత్తితో దాడి: ఆత్మహత్మాయత్నం చేసిన యువకుడు

ఈ సంఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. చిన్నారులపై, మహిళలపై జరిగే దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వం సహించదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఉన్మాదకరమైన ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని,  చట్టాలను కఠినతరం  చేసే చర్యల్లో భాగంగానే దిశ బిల్లును  రూపొందించినట్లు హోంమంత్రి సుచరిత తెలిపారు.

విజయవాడలో ఇంజనీరింగ్ విద్యార్ధిని తేజస్విని ఇంటికి వెళ్లి స్వామి అనే యువకుడు కత్తితో ఆమె గొంతు కోశాడు.  ఆ తర్వాత తనను తాను గాయపర్చుకొన్నాడు. ఇలా ఇన్నాళ్లు ప్రేమపేరిట వేధించి తాజాగా యువతి ప్రాణాలను బలితీసుకున్నాడు ఈ సైకో.

click me!