గుంటూరు : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై రాళ్ళ దాడి జరిగిందనేది అవాస్తవం అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. తిరుపతి ఎన్నికల్లో ఘోర వైఫల్యం చెందుతామనే భయం టీడీపీ లో కనబడుతోందన్నారు.
గుంటూరు : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై రాళ్ళ దాడి జరిగిందనేది అవాస్తవం అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. తిరుపతి ఎన్నికల్లో ఘోర వైఫల్యం చెందుతామనే భయం టీడీపీ లో కనబడుతోందన్నారు.
ఈ రాళ్ళ దాడి ఘటన ద్వారా ప్రజల్లో సానుభూతి పొందాలని చంద్రబాబు చూస్తున్నారని, ప్రజలెవ్వరు చంద్రబాబు చెప్పే మాయ మాటలను నమ్మే పరిస్థితుల్లో లేరని ఎద్దేవా చేశారు.
వైసీపీ నాయకులకు రాళ్ళ దాడి చేయవలసిన అవసరం, అగత్యం లేదని, తిరుపతి ఎన్నికల్లో తమ అభ్యర్ధి ఘన విజయం సాధించబోతున్నాడని జోస్యం చెప్పారు.
వైఎస్ వివేకానంద హత్య కేసు సీబీఐ పరిధిలోని అంశం అని, సీబీఐ కోరితే రాష్ట్ర పోలీస్ యంత్రాగం తప్పని సరిగా సహకరిస్తుందన్నారు. వైఎస్ వివేకా హత్యకేసును కేంద్రంలో ఉన్న బీజేపి, జనసేన త్వరిత గతిన పూర్తిచేయాలని తాము కోరుకుంటున్నామన్నారు.
కాగా, సోమవారం తిరుపతిలో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచార సభలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. బాబు ప్రచారం నిర్వహిస్తున్న వాహనం లక్ష్యంగా చేసుకొని రాళ్లు విసిరారు.ఈ రాళ్లదాడిలో ఓ మహిళకు, యువకుడికిగా గాయాలయ్యాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తనపై జరిగిన రాళ్ల దాడికి సంబంధించిన రాళ్లను చంద్రబాబునాయుడు సభలో చూపించారు. ఆ తర్వాత ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఆయన ఈ విషయమై ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనను నిరసిస్తూ చంద్రబాబునాయుడు ప్రచార వాహనం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. చంద్రబాబునాయుడును నిరసన వద్దని పోలీసులు కోరారు.జడ్ ప్లస్ కేటగరి రక్షణ ఉన్న తనకే భద్రత కల్పించలేని తనకు రక్షణ కల్పించలేని మీరు సామాన్యులకు ఏం రక్షన కల్పిస్తారని ఆయన పోలీసులను ప్రశ్నించారు.
పోలీసుల తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఇది పిరికిపందల చర్యగా ఆయన పేర్కొన్నారు. పోలీసుల వైఫల్యం వల్లే ఇదంతా జరిగిందని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలా న్యాయం చేస్తారో చెప్పాలని చంద్రబాబు పోలీసులను కోరారు. ఈ ఘటనను నిరసిస్తూ సీఎం డౌన్ డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.