
ఆంధ్రప్రదేశ్‌లో వేసవిలో వాతావరణం తారుమారవుతోంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతుండగా, మరికొన్ని జిల్లాల్లో వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉదయానికే సూర్యుడు ఉగ్రరూపం దాల్చడంతో జనం ఇంట్లోనే ఉండే పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం పది గంటలకే రోడ్ల మీదకి రావాలంటే జనం వెనుకాడుతున్నారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం పల్నాడు జిల్లాలోని నరసరావుపేట మండలం కాకానిలో 43.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఈ వేసవిలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతల్లో ఒకటి.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. మంగళవారం రోజున 21 మండలాల్లో తీవ్రమైన వడగాలుల ప్రభావం ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 11 మండలాలు, విజయనగరంలో 2, కాకినాడలో 3, తూర్పు గోదావరిలో ఒక మండలంలో వడగాలులు బలంగా వీచే అవకాశం ఉంది.
అత్యధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లకూడదని, శరీరానికి తేమ తగ్గకుండా చూసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.ఇక వాతావరణ విభాగం ఇచ్చిన వివరాల ప్రకారం, మంగళవారం రాయలసీమ ప్రాంతంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం రాష్ట్రంలో పలుచోట్ల మోస్తారు వర్షాలు పడొచ్చని అంచనా.
ఇక ప్రజలను అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో నేర్పించేందుకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మాక్ డ్రిల్స్ చేపట్టనుంది. మంగళవారం విజయనగరం, ఏలూరు, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాల్లో ఈ డ్రిల్స్ నిర్వహించనుండగా, బుధవారం పార్వతీపురం మన్యం, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, గుంటూరు, పల్నాడు, నెల్లూరు, అన్నమయ్య, అనంతపురం జిల్లాల్లో నిర్వహించనున్నారు.శుక్రవారం రోజున కాకినాడ, చిత్తూరు జిల్లాల్లో మాక్ ఎక్సర్‌సైజ్‌లు జరగనున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ ప్రజల్లో అవగాహన పెంచేందుకు చేపట్టబడుతున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.