
మీరందరూ పాములను చూసేవుంటారు. అందులోని రకాల గురించి కుడా వినుంటారు. అయితే, ఇపుడు చదవబోయే పాము గురించి మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసుంటుంది. అదే ఫ్లైయింగ్ స్నేక్. దీని శాస్త్రీయంగా ఒర్నేట్ ఫ్లయింగ్ స్నేక్ అని కానీ లేకపోతే క్రైసోపెలీ ఒర్నట అని కూడా పిలుస్తారు. ఇటువంటి పాములు ఎక్కువగా పశ్చిమ కనుమలు, బీహార్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో కనిపిస్తుంటుంది.
ఇంతకీ విషయానికి వస్తే ఫ్లయింగ్ స్నేక్ గురువారం హైదరాబాద్ లో దర్శనమిచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కనబడటం ఇదే మొదటిసారి. ఘోషామహల్లోని ఓ కట్టెల వ్యాపారస్తుని షాపులో ఈ పాము కనబడింది. షాపు ఓనర్ ఉదయం షాపు షట్టర్లు తెరిచేటప్పటికి లోపలుంది. పాము చూడటానికే విచిత్రంగా ఉండటంతో భయపడి వెంటనే స్నేక్ సొసైటీకి ఫోన్ చేసారు.
సొసైటీ సంయుక్త కార్యదర్శి అరుణ్ కుమార్ తో పాటు టీం సభ్యులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మొదట వారు కూడా దీన్ని సాదారణ పాముగానే అనుకున్నారట. కానీ పరిశీలించి చూసినపుడు అది మామూలు పాము కాదని ఫ్లయింగ్ స్నేక్ అని అర్ధమైంది. దీని ప్రత్యేకత ఏంటంటే, గాలిలో నుండి గాలిలోకి ఎగురుతుంది. అంటే ఒక చెట్టుపై నుండి ఇంకో చెట్టుపైకి ఎగిరిపోతుందన్నమాట. అరుదైన పాము కాబట్టి జాగ్రత్తగా పట్టుకుని సురక్షిత కేంద్రానికి తరలించినట్లు అరుణ్ తెలిపారు.