కాపులకు రిజర్వేషన్ల కోసం రేపటి నుంచి నిరవధిక నిరహార దీక్ష.. హరిరామజోగయ్య

By Sumanth KanukulaFirst Published Jan 1, 2023, 12:57 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో కాపులకు రిజర్వేషన్లకు సంబంధించి ఆ సామాజిక వర్గానికి చెందిన నేత, మాజీ ఎంపీ హరిరామ జోగయ్య నిరవధిక దీక్షకు సిద్దమయ్యారు. 

ఆంధ్రప్రదేశ్‌లో కాపులకు రిజర్వేషన్లకు సంబంధించి ఆ సామాజిక వర్గానికి చెందిన నేత, మాజీ ఎంపీ హరిరామ జోగయ్య నిరవధిక దీక్షకు సిద్దమయ్యారు. కాపులకు రిజర్వేషన్లకు సంబంధించి డిసెంబర్ 30వ తేదీలోపు ఉత్తర్వులు జారీ చేయాలని హరిరామయ్య ఇటీవల ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. లేదంటే జనవరి 2 నుంచి తాను నిరహార దీక్షకు దిగనున్నట్టుగా చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా స్పందించిన హరిరామజోగయ్య.. కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వానికి ఇచ్చిన అల్టిమేటంపై ఎటువంటి స్పందన లేదన్నారు. కాపులకు రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా రేపటి నుంచి నిరవధిక నిరహార దీక్షకు దిగుతున్నట్టుగా ప్రకటించారు. 

పాలకొల్లులో దీక్ష చేపడతానని వెల్లడించారు. తన నిరహారదీక్షకు పోలీసులు అనుమతి కోరానని.. అయితే వారు అనుమతి ఇవ్వలేదని అన్నారు. తన దీక్షను భగ్నం  చేసి ఎక్కడికి తరలిస్తే అక్కడ దీక్షను కొనసాగిస్తానని చెప్పారు. తాను మరణించైనా కాపులకు రిజర్వేషన్లు సాధిస్తానని అన్నారు. 

 

Also Read: కాపు రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హరిరామ జోగయ్య డెడ్‌లైన్.. లేకపోతే నిరహార దీక్షకు దిగుతానని హెచ్చరిక

ఇక, రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రవర్ణాలలో వెనకబడిన కులాల వారికి కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లు కాపులకు అమలు చేయాలని సీఎం జగన్‌ను హరిరామ జోగయ్య కోరారు. రిజర్వేషన్ల అనేది తమ హక్కు అని అన్నారు. రాష్ట్ర శాసనసభ చేసిన తీర్మానం ప్రకారంగా.. అగ్రవర్ణాల్లో వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లలో తమకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు డిసెంబర్ 30వ తేదీలోపు ఉత్తర్వులు జారీ చేయాలని డెడ్ లైన్ విధించారు. రిజర్వేషన్లను సంబంధించి ఉత్తర్వులు ఇవ్వకపోతే జనవరి 2వ తేదీ నుంచి తాను నిరవధిక నిరహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. ప్రభుత్వం ఇవ్వకపోయినా.. తాను చచ్చైనా సరే సాధించుకుంటానని అన్నారు. 

click me!