శనివారం ఉదయం 8 గం.లకు ప్రారంభం కావాల్సిన గగన్ యాన్ కాస్త ఆలస్యంగా 8.30 గంటలకు మొదలవ్వబోతోంది. సాంకేతిక కారణాల వల్లే ఈ మార్పు అని సమాచారం.
ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గగనయాన్ ప్రయోగంలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. గగన్ యాన్ ప్రయోగం అరగంట లేటుగా ఈ ఉదయం 8.30కు నిర్వహించనున్నట్లుగా ఇస్రో తెలిపింది. ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీహరికోట మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. ఇప్పటికే ఈ ప్రక్రియకు సంబంధించిన కౌంట్ డౌన్ గత రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యింది.
గగన్ యాన్ కు ముందు ఇస్రో నిర్వహించనున్న నాలుగు పరీక్ష్లోల.. టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ మొదటిది. అదే ఇప్పుడు నిర్వహించనున్నారు. ఇంతకుముందు 2018లో ఇలాంటి పరీక్ష నిర్వహించినప్పటికీ.. అది పరిమిత స్థాయిలోనే జరిగింది. ఈసారి దాదాపుగా పూర్తిస్థాయిలో సిద్ధమైన వ్యోమనౌకను పరీక్షించనున్నారు. దీని ఫలితాల ఆధారంగా ఇస్రో తదుపరి పరీక్షలకు సిద్ధమవుతుంది. శ్రీహరికోటలో శాస్త్రవేత్తలతో సోమనాథ్ ఈ విషయం మీద చర్చిస్తున్నారు.
ఇదిలా ఉండగా, చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్ 1ల సక్సెస్‌తో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పరిశోధనా రంగంలో సాటిలేని మేటిగా నిలిచింది. ఇప్పుడు అందరి చూపూ ఇస్రో వైపే ఉంది. ఇస్రో ఎప్పుడు ఏం చేస్తుందోనని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. ఒకప్పుడు భారత అంతరిక్షపరిశోధనలను అవమానించిన వారే ఇప్పుడు మన టెక్ సపోర్ట్ కోసం అడుగుతున్నారు. చంద్రయాన్ 3 అనుభవాలను తమతో పంచుకోవాల్సిందిగా స్వయంగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా)నే అడిగిందంటే స్పేస్‌లో ఇస్రో స్థాయి ఎక్కడికి చేరుకుందో అర్ధం చేసుకోవచ్చు.
అలాంటి మరో ప్రయత్నమే.. ఇస్రో గగన్‌యాన్ మిషన్. మనిషిని అంతరిక్షంలోకి పంపించాలన్నది ఈ మిషన్ లక్ష్యం. ఈ ప్రయోగానికి సంబంధించి శనివారం ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ 1 (VD1) పరీక్షను నిర్వహించనుంది ఇస్రో. చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరిన తొలి దేశంగా నిలిచిన భారత్..ఈసారి మనిషిని అంతరిక్షంలోకి పంపుతున్నందున మరిన్ని జాగ్రత్తలు తీసుకోనుంది.