అమరావతి రాజధాని గుట్టు విప్పిన బిజెపి ఎంపీ జీవీఎల్

By telugu teamFirst Published Mar 6, 2020, 2:44 PM IST
Highlights

అమరావతిని రాజధానిగా కొనసాగించే విషయంపై బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో రాష్ట్ర కోరినప్పటికీ కేంద్రం దాన్ని వినాలని లేదని జీవీఎల్ చెప్పారు.

న్యూఢిల్లీ: అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించే విషయంపై బీజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని తమ పార్టీ రాష్ట్ర శాఖ తీర్మానం చేసిన విషయం నిజమే గానీ కేంద్రం దాన్ని వినాలని ఏమీ లేదని ఆయన అన్నారు. 

పిపీఎల రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టినప్పటికీ కేంద్రం రాష్ట్రంపై చర్యలు తీసుకోలేకపోయిందని చెప్పారు. బిజెపి ఎంపీ సుజనా చౌదరి మీడియాతో మాట్లాడిన రెండు మూడు గంటలకే హడావిడిగా జీవీఎల్ మీడియాతో మాట్లాడడం విశేషం. 

తమ రాష్ట్ర పార్టీ కోరిన అన్ని అంశాలనూ కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని లేదని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలను బర్తరఫ్ చేయాలని కూడా రాష్ట్ర పార్టీలు కోరుతుంటాయని, కానీ కేంద్రం అలా చేయదని ఆయన చెప్పారు. ఏపీ రాష్ట్ర రాజధాని ఏర్పాటు అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదేనని ఆయన స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కూడా వేసవి రాజధానిని ప్రకటించడం దానికి నిదర్శనమని ఆయన అన్నారు 

అమరావతి గురించి గానీ, రాజకీయాల గురించి గానీ బిజెపి అధిష్టానం అనుమతితోనే తాను ప్రతి విషయం మాట్లాడుతానని ఆయన స్పష్టం చేశారు. రాజధాని విషయంలో పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాతనే చెబుతామని అంటున్నట్లు ఆయన తెలిపారు.

రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులోనే స్పష్టంగా చెప్పిందని, నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని కేంద్రం తప్పుడు నిర్ణయాలు తీసుకోదని అన్నారు. 

ఎవరైనా కేంద్రం చేతిలో అధికారం ఉందని అమరావతి విషయంలో తప్పుడు హామీలు ఇచ్చినా, వ్యాఖ్యలు చేసినా అవన్నీ వారి వ్యక్తిగత అభిప్రాయాలే అవుతాయని జీవీఎల్ అన్నారు.

ఇటీవల విజయవాడలో నగర ప్రముఖులు, మేధావులతో ఆ ప్రాంత సమస్యలపై సమావేశం జరిగిందని, కొందరు జేఏసీ నేతలు కూడా పాల్గొన్నారని, వారు రాజధానిపై ఉన్న అనిశ్చితిని ప్రస్తావించారని ఆయన చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మన పార్లమెంటరీ వ్యవస్థలో కొన్ని పరిమితులు ఉంటాయని తాను వారికి చెప్పినట్లు ఆయన తెలిపారు. 

సీఆర్డీఎతో చేసుకున్న ఒప్పందం ప్రకారం రైతులు భూములు ఇచ్చారు కాబట్టి కచ్చితంగా వారికి న్యాయం జరుగుతుందని చెప్పారు. ఆ ప్రాంతంలో అభివృద్ధికి ప్రభుత్వం ఏయే నిర్ణయాలు తీసుకుంటుందో, ఏయే మౌలిక సదుపాయాలు కల్పిస్తుందో వారికి వివరంగా చెప్పినట్లు ఆయన తెలిపారు. 

తనను కించపరిచే విధంగా ఓ చానెల్ తప్పుడు వార్తలు ప్రసారం చేస్తోందని జీవీఎల్ ఆరోపించారు. మరోసారి ఇలాంటి అవాస్తవమైన వార్తలు ప్రసారం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మళ్లీ తనపై కట్టుకథలు అల్లితే సమాచార శాఖకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.

click me!