
Greater Palnadu: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం మరో సారి తెర మీదికి వచ్చింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను మరో రెండు మూడు రోజుల్లో వెలువబడనున్నది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల సంఖ్యను 26కు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం మీద ఉగాది లోపు జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేసి.. కొత్త జిల్లాల(New Districts)ను అమలులోకి తెచ్చేందుకు జగన్ సర్కార్ కసరత్తు చేస్తోన్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో సీఎం జగన్ కు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు లేఖ రాశారు. నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేసే జిల్లాకు‘గ్రేటర్ పల్నాడు’ లేదా ‘మహా పల్నాడు’ జిల్లాగా పేరు పెట్టాలని కోరారు. పార్లమెంట్ నియోజకవర్గాల తరహాలో జిల్లాల పునర్వ్యవస్థీకరణను వేగవంతం చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. సమతుల్య అభివృద్ధి కోసం 26 జిల్లాలను రాష్ట్రంలో త్వరగా ఏర్పాటు చేయాలని జీవీఎల్ కోరారు.
ఇది చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న నిర్ణయమని, రాష్ట్రంలో మరింత మెరుగైన పరిపాలన, వేగవంతమైన, సమతుల్య అభివృద్ధి కోసం వీలైనంత త్వరగా అమలు చేయాలని జీవీఎల్ తన లేఖలో పేర్కొన్నారు.
పల్నాడు పాంత్రానికి మహోన్నత చరిత్ర, సంప్రదాయం, సాంస్కృతిక గుర్తింపు ఉందని, పల్నాడు ప్రాంతానికి నరసరావుపేట ముఖ ద్వారం కాబట్టి… నరసరావుపేట కేంద్రంగా గ్రేటర్ పల్నాడు లేదా మహా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ కోరారు. ఈ ప్రాంతంలోని వెనుకబాటు, అభివృద్ధి అవసరాలపై ఈ జిల్లా దృష్టి సారిస్తుందని జీవీఎల్ తన లేఖలో పేర్కొన్నారు.
పరిపాలనా సౌలభ్యం కోసం ప్రతీ లోక్‌సభ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందే వైసీపీ(YSRCP) తమ మేనిఫెస్టోలో పేర్కొంది. అయితే కరోనా కారణంగా 2021 జనాభా లెక్కల సేకరణ వాయిదా.. ఇతర కారణాల వల్ల.. ఈ ప్రక్రియలో జాప్యం ఏర్పడింది.
కొత్త జిల్లాలు ఇవే..
ఏపీలో మొత్తం 25 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు తోడుగా ప్రభుత్వం కొత్తగా మరో 13 జిల్లాలను ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ భావిస్తోంది. అరకులో 2 జిల్లాలు, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, నరసాపురం, ఏలూరు, విజయవాడ, నరసరావుపేట, బాపట్ల, నంద్యాల, హిందూపురం, రాజంపేట లు కొత్త జిల్లాలుగా ఏర్పాటు కానున్నట్టు తెలుస్తోంది.
తొలుత.. కొత్త జిల్లాల ఏర్పాటుపై రెవిన్యూ శాఖ ప్రాధమిక నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ఆ తర్వాత .. స్థానికులు సూచనలు, సలహాల కోసం దాదాపు 30 రోజులు గడువు ఇవ్వనున్నారు. వాటిని పరిశీలించిన తర్వాత మార్పులు చేర్పులు చేస్తారు. ఆ తరువాత తుది నోటిఫికేషన్ జారీ అవుతోంది.