వైసీపీ నుంచి టీడీపీలోకి పెద్ద ఎత్తున నేతలు వస్తున్న వేళ.. వైసీపీ సైతం కౌంటర్ వ్యూహాన్ని అమలు చేస్తోంది. గుంటూరు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న టీడీపీ నేత, ఎంపీ గల్లా జయదేవ్ వ్యవహారం ఇప్పుడు ఆసక్తికర చర్చ మొదలైంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ , సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఆయా పార్టీల్లో టికెట్లు దొరకని నేతలు, దొరకవని ముందే గ్రహించిన నాయకులు పక్కచూపులు చూస్తున్నారు. ఎవరు ఏ పార్టీలో వున్నారో తెలియని పరిస్ధితి నెలకొంది. అధికార, ప్రతిపక్షం ఇలా రెండూ పార్టీల్లోనూ నేతలు అసంతృప్త నేతలు వున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి పెద్ద ఎత్తున నేతలు వస్తున్న వేళ.. వైసీపీ సైతం కౌంటర్ వ్యూహాన్ని అమలు చేస్తోంది. తెలుగుదేశం సిట్టింగ్ ఎంపీలు.. ఆ పార్టీకి ప్రధానంగా అండగా నిలిచే సామాజిక వర్గ నేతలను వైసీపీ టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు.
తాజాగా విజయవాడకు పక్కనేవున్న మరో కీలక నియోజకవర్గం గుంటూరు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న టీడీపీ నేత, ఎంపీ గల్లా జయదేవ్ వ్యవహారం ఇప్పుడు ఆసక్తికర చర్చ మొదలైంది. ఇక్కడి నుంచి 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఎంపీగా గెలిచిన జయ్‌దేవ్ సెకండ్ టర్మ్ తొలినాళ్లలో కొంత యాక్టీవ్‌గానే వ్యవహరించారు. ఎప్పుడైతే జగన్ సర్కార్ గల్లా కుటుంబానికి చెందిన అమరరాజాపై గురి పెట్టిందో జయ్‌దేవ్ పూర్తిగా సైలెంట్ అయ్యారు. అంతేకాదు.. తన వ్యాపారాలను తెలంగాణ, తమిళనాడుకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
గల్లా జయదేవ్ రాజకీయాలకు దూరంగా వుండాలని నిర్ణయించుకున్నారని.. సంక్రాంతి సెలవుల తర్వాత తన అనుచరగణంతో సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అటు జయదేవ్ తల్లి గల్లా అరుణ కుమారి కూడా పార్టీకి దూరంగానే వుంటున్నారు. ఇప్పటికే పొలిట్‌బ్యూరో సభ్యత్వానికి కూడా ఆమె రాజీనామా చేశారు. అటు జయదేవ్ కూడా పూర్తిగా తన వ్యాపారాలకే పరిమితం కావడంతో చంద్రబాబు సైతం గుంటూరు ఎంపీ స్థానానికి కొత్త నేతను ఎంపిక చేసే పనిలో వున్నారని వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి పరిస్ధితుల్లో గల్లా జయదేవ్ వైసీపీలో చేరుతారంటూ ఊహాగానాలు రావడం కలకలం రేపుతోంది. సీఎం వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో గల్లా టచ్‌లోకి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. గల్లా కుటుంబానిది చంద్రగిరి నియోజకవర్గమే. చెవిరెడ్డి ద్వారా జగన్‌కు రాయబారం పంపి వైసీపీలోకి వెళ్లేందుకు గల్లా జయదేవ్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారంటూ ప్రచారం జరుగుతోంది. మరి సూపర్ స్టార్ మహేశ్ బాబు బావగారు .. రాజకీయాలకు స్వస్తి చెబుతారా లేదంటే గుంటూరు ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేస్తారా అనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.