swachh survekshan 2023 : క్లీన్ ఏపీకి సత్ఫలితాలు.. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రానికి అవార్డుల పంట

By Siva KodatiFirst Published Jan 11, 2024, 5:40 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌కు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల పంట పండింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో రాష్ట్రానికి నాలుగు జాతీయ అవార్డులు, ఒక రాష్ట్ర స్థాయి అవార్డు దక్కింది.

ఆంధ్రప్రదేశ్‌కు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల పంట పండింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో రాష్ట్రానికి నాలుగు జాతీయ అవార్డులు, ఒక రాష్ట్ర స్థాయి అవార్డు దక్కింది. దక్షిణ భారతదేశంలోని క్లీన్ సిటీల్లో ఏపీ నెంబర్‌వన్‌గా నిలిచింది. గుంటూరుకు జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్, గ్రేటర్ విశాఖకు ఆలిండియా 4వ ర్యాంక్, విజయవాడకు ఆలిండియా 6వ ర్యాంక్, తిరుపతి ఆలిండియా 8వ ర్యాంక్ సాధించాయి. నగరాలను అత్యంత పరిశుభ్రంగా తీర్చిదిద్దినందుకు గాను ఏపీకి ఈ అవార్డులు దక్కాయి. 

అవార్డులపై ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. పట్టణాలు, నగరాల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ చేస్తున్న కృషికి ఈ అవార్డులు చిహ్నమని చెప్పారు. క్లీన్ ఏపీ (క్లాప్) ప్రోగ్రాం విజయవంతమైందని.. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించామని ఆదిమూలపు అన్నారు. కార్మికులంతా విధుల్లో చేరారని , సమ్మె కారణంగా కొంత ఇబ్బంది కలిగిందని మంత్రి తెలిపారు. మరోవైపు.. 2022లోనూ జాతీయ స్థాయిలో అత్యుత్తుమ పారిశుధ్య కార్మిక విధానాలు పాటిస్తున్నందుకు గాను తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్‌కు సఫాయిమిత్ర సురక్షా సెహెర్ పురస్కారం దక్కిన సంగతి తెలిసిందే. 

Latest Videos

కాగా.. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారు. దీనిలో భాగంగా 2016లో పరిశుభ్రతలో మంచి పనితీరు కనబరిచే నగరాలను గుర్తించడం, గౌరవించడం , ప్రోత్సహించడం కోసం స్వచ్ఛ సర్వేక్షణ్ అనే కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారు. దీని కింద స్వచ్ఛ నగరాలకు అవార్డును అందజేస్తారు. 

స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా ప్రారంభించబడిన ఈ పథకం కింద, ప్రతి సంవత్సరం కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివిధ కేటగిరీల కింద దేశంలోని పరిశుభ్రమైన నగరాల ర్యాంకింగ్ జాబితాను విడుదల చేస్తుంది. దీని ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2023 సంవత్సరానికి గాను స్వచ్ఛ్ సర్వేక్షణ్ ఫలితాలను ప్రకటించారు. ఇందులో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ భారతదేశంలోని పరిశుభ్రమైన నగరాల జాబితాలో వరుసగా 7వ సారి అగ్రస్థానంలో నిలిచింది.

click me!