చంద్రన్న కానుక పంపిణీలో తొక్కిసలాట.. ఉయ్యూరు శ్రీనివాస్ రిమాండ్ తిరస్కరణ..

By Sumanth KanukulaFirst Published Jan 3, 2023, 11:10 AM IST
Highlights

గుంటూరులో చంద్రన్న సంక్రాంతి  కానుక పంపిణీ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసులు.. ఆ కార్యక్రమం నిర్వాహకుడు  ఉయ్యారు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 

గుంటూరులో చంద్రన్న సంక్రాంతి  కానుక పంపిణీ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసులు.. ఆ కార్యక్రమం నిర్వాహకుడు  ఉయ్యారు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం శ్రీనివాసరావును మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. అయితే శ్రీనివాస్‌ రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తి తిరస్కరించారు. రూ. 25 వేల వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే పోలీసుల విచారణకు శ్రీనివాస్‌సహకరించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ క్రమంలోనే శ్రీనివాస్‌ వ్యక్తిగత పూచీకత్తుపై విడుదలయ్యారు. 

శ్రీనివాస్‌ తరఫు లాయర్ మాట్లాడుతూ..  ఘటనతో సంబంధం లేని సెక్షన్ 304 ఈ కేసులో వర్తించదని చెబుతూ.. రిమాండ్‌ను తిరస్కరిస్తూ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. 

ఇక, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఆదివారం సాయంత్రం ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చంద్రబాబు సభలో ప్రసంగించి అక్కడి నుంచి వెళ్లిపోయిన కొద్దిసేపటికే.. తొక్కిసలాట చోటుచేసుకుంది. తొక్కిసలాటలో ఒక్కరు ఘటన స్థలంలో మృతిచెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పలువురు గాయపడ్డారు. నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు నాయుడు బుధవారం ఎనిమిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల వ్యవధిలోనే మరోసారి అలాంటి ఘటనే చోటుచేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. 

ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో పలు నిబంధనలను తుంగలో తొక్కారని పోలీసులు ఎత్తిచూపారు. ఈ కార్యక్రమాన్ని తాము నిర్వహించలేదన్న టీడీపీ వాదనను తోసిపుచ్చిన పోలీసులు.. లౌడ్ స్పీకర్లను ఉపయోగించడానికి టీడీపీ గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌ కుమార్‌ అనుమతి కోరినట్లు చెప్పారు.

ఈ ఘటనలో మృతిచెందిన రమాదేవి కుమారుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కార్యక్రమ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం విజయవాడలో శ్రీనివాస్‌ను గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం గుంటూరు తరలించారు. అక్కడ విచారించిన అనంతరం ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి.. రాత్రి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. కాగా, ముగ్గురు మృతుల కుటుంబాలకు ఉయ్యూరు ఫౌండేషన్ రూ.20 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

click me!