శ్రీకాకుళం జిల్లాలో కాల్పుల కలకలం... అర్ధరాత్రి మహిళతో మాట్లాడుతుండగా సర్పంచ్ పై హత్యాయత్నం

By Arun Kumar PFirst Published Jan 19, 2022, 11:45 AM IST
Highlights

గత అర్ధరాత్రి శ్రీకాకుళం జిల్లాకేంద్రంలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ గ్రామ సర్పంచ్ పై గుర్తుతెలియని దుండగులు తుపాకీతో కాల్పులు జరిపి హత్యాయత్నానికి పాల్పడ్డారు.  

శ్రీకాకుళం: ఓ గ్రామ సర్పంచ్ పై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపిన ఘటన ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా (Srikakulam District)లో చోటుచేసుకుంది. గార మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన సర్పంచ్ వెంకటరమణ మూర్తి పై ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్పులు జరిపి పరారయ్యారు.కాల్పుల్లో గాయపడిన సర్పంచ్ ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. 

వివరాల్లోకి వెళితే... గత (మంగళవారం) అర్ధరాత్రి శ్రీకాకుళంలోని రామచంద్రాపురం సర్పంచ్ నివాసానికి ఓ మహిళ ఇద్దరు పురుషులతో కలిపి వెళ్ళింది. అయితే తన కార్యాలయంలో ఏదో విషయమై మహిళతో  సర్పంచ్ మాట్లాడుతుండగానే హటాత్తుగా ఆమె వెంటవచ్చిన ఇద్దరు తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. తుపాకీ గుండ్లు సర్పంచ్ శరీరంలోకి దూసుకెళ్లకుండా కేవలం రాసుకుంటూ వెళ్లడంతో ప్రమాదం తప్పింది. వెంకటరమణ గాయపడగా మహిళతో పాటు ఇద్దరు దుండగులు అక్కడినుండి పరారయ్యారు. 

కాల్పుల శబ్దం విని సర్పంచ్ కుటుంబసభ్యులతో పాటు చుట్టుపక్కల వారు వచ్చిచూడగా వెంకటరమణ గాయపడివున్నాడు. దీంతో కుటుంబసభ్యులు వెంటనే అతడిని సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్న డాక్టర్లు పరిస్థితి విషమంగా వుందని చెబుతున్నారు. 

సర్పంచ్ పై కాల్పులు జరిగినట్లు సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్పారు. అక్కడ పోలీసులకు రెండు బుల్లెట్లు లభ్యమయ్యాయి. దీంతో సర్పంచ్ పై దుండగులు రెండు రౌండ్లు కాల్పులు జరిపి వుంటానని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సర్పంచ్ పై కాల్పులకు కారణాలు పూర్తిగా తెలియకపోయినా... పాత గొడవలే కారణమని భావిస్తున్నారు. సర్పంచ్ వద్దకు వచ్చిన మహిళ, దుండగులు ఎవరో తెలియాల్సి వుంది. ముందస్తు ప్రణాళికతోనే తుపాకీతో సర్పంచ్ వద్దకు చేరుకున్న దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.  

click me!