కరోనా బాధిత కుటుంబాలకు బాసట...వెంటనే ఒకరికి ప్రభుత్వోద్యోగం..: జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు

By Arun Kumar PFirst Published Jan 19, 2022, 10:28 AM IST
Highlights

కరోనాతో మృతిచెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని జగన్ సర్కార్ నిర్ణయించింది.  

అమరావతి:  కరోనా (corona)తో ఇంటిపెద్ద దిక్కును కోల్పొయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న కొన్ని కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం బాసటగా నిలిచింది. కోవిడ్(covid19) కారణంగా మృతిచెందిన ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల (front line workers) కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకం (compassionate appointments) కింద ఉద్యోగం కల్పించనున్నట్లు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ఈ కారుణ్య నియామకాలకు సంబంధించి తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

కరోనాతో మృతిచెందిన ఉద్యోగి నిర్వహించిన పోస్టుకు సమానమైన ఉద్యోగం లేదా అంతకంటే తక్కువస్థాయి హోదాతో అర్హులైన వారి కుటుంబసభ్యుల నియామకం వెంటనే జరపాలంటూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కోవిడ్ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా  ఈ నియామకాలను 2021 నవంబరు 31లోగా చేపట్టాలని నిర్ణయించినా పెద్ద మొత్తంలో దరఖాస్తులు రావడంతో నిర్ణీత సమయంలో నియామక ప్రక్రియ పూర్తిచేయడం సాధ్యం కాలేదని ప్రభుత్వం తెలిపింది. 

సాధ్యమైనంత తొందరగా కారుణ్య నియామకాలను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఖాళీలను మృతిచెందిన ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబ సభ్యులతో భర్తీ చేయాలని నిర్ణయించింది. త్వరితగతిన దరఖాస్తులను పరిష్కరించి అర్హులైన అభ్యర్ధులతో తక్షణమే గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఖాళీలను భర్తీ చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసారు. 

ఇదిలావుంటే ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతోంది. తాజాగా రాష్ట్రంలో 6,996 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 21,14,489కి చేరుకుంది. 

తాజాగా కరోనా మహమ్మారి వల్ల విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరు, నెల్లూరులలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,514కి చేరుకుంది. 

కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగినా రికవరీ రేటు మాత్రం పెరగడం లేదు. తాజాగా కరోనా నుంచి 1,066 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,63,867కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 38,055 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,19,22,969కి చేరుకుంది. 

ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 36,108 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 462, చిత్తూరు 1534, తూర్పుగోదావరి 292, గుంటూరు 758, కడప 202, కృష్ణ 326, కర్నూలు 259, నెల్లూరు 246, ప్రకాశం 424, శ్రీకాకుళం 573, విశాఖపట్నం 1263, విజయనగరం 412, పశ్చిమ గోదావరిలలో 245 చొప్పున వైరస్ బారినపడ్డారు. 

కరోనా థర్డ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే నైట్ కర్ఫ్యూ విధించడంతో పాటు మాస్కులు, శానిటైజర్ వినియోగం తప్పనిసరి చేసింది. మాస్కు లేకుండా బయటకు వస్తూ జరిమానా విధిస్తోంది. 

  

click me!