వారి దృష్టిలో బీహార్ ఆఫ్ సౌత్ గా ఏపి: చంద్రబాబు

Arun Kumar P   | Asianet News
Published : Jul 01, 2020, 01:10 PM IST
వారి దృష్టిలో బీహార్ ఆఫ్ సౌత్ గా ఏపి: చంద్రబాబు

సారాంశం

అమర్ రాజా ఇన్ ఫ్రాటెక్ భూములు వెనక్కి తీసుకోవడం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని... టిడిపి ఎంపి గల్లా జయదేవ్ పై అక్కసుతోనే వైసిపి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మాజీ సీఎం, టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 

గుంటూరు: అమర్ రాజా ఇన్ ఫ్రాటెక్ భూములు వెనక్కి తీసుకోవడం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని... టిడిపి ఎంపి గల్లా జయదేవ్ పై అక్కసుతోనే వైసిపి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మాజీ సీఎం, టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలోనే అత్యధిక పన్నులు చెల్లించే పారిశ్రామిక వేత్త గల్లా రామచంద్ర నాయుడని చంద్రబాబు గుర్తుచేశారు. 

''పారిశ్రామికంగా ఏపిని ప్రపంచపటంలో పెట్టాలనే లక్ష్యంతో విదేశాల నుంచి వచ్చి అమర్ రాజా యూనిట్ల స్థాపించారు. తమ కంపెనీలలో 16వేల మందికి ఉపాధి కల్పించారు. 20వేల మందికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.  అటువంటి పారిశ్రామిక వేత్తలకు కూడా వైసిపి మోకాలడ్డటం గర్హనీయం'' అని చంద్రబాబు మండిపడ్డారు. 

''వెనుకబడిన ప్రాంతమైన పశ్చిమ చిత్తూరు అభివృద్దికి, యువత ఉపాధి కల్పనకు అమర్ రాజా పరిశ్రమలు ఎంతో తోడ్పడ్డాయి.  బంగారు పాళ్యెం భూముల్లో ఇప్పటికే యూనిట్ ను నెలకొల్పారు. 5వేల మందికి ఉపాధి కల్పించారు. సగం భూములు అభివృద్ది చేసి మరోసగం అభివృద్దికి రంగం సిద్దం చేశారు. ఈ తరుణంలో 250ఎకరాల భూమి కేటాయింపు రద్దు చేయడం కేవలం కక్ష సాధింపులో భాగమే'' అని ఆరోపించారు. 

read more  నెల్లూరులో దివ్యాంగురాలిపై దాడి... సీఎం, మంత్రులు వల్లే: చంద్రబాబు

''భూములు తీసుకుని పరిశ్రమలు పెట్టనివాళ్లను వదిలేశారు. సగం అభివృద్ది చేసి, మిగతా సగం అభివృద్దికి సిద్దమైన వాళ్లను వేధిస్తున్నారు. పాలకులకు పగ-ప్రతీకారాలు ఉండరాదు. ఈ విధంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రారు'' అని హెచ్చరించారు. 

''ఇప్పటికే వైసిపి ప్రభుత్వ దుశ్చర్యలతో ఆంధ్రప్రదేశ్ గత ఏడాదిగా దేశవిదేశాల్లో అప్రదిష్టపాలైంది. జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, సింగపూర్, కొరియా తదితర దేశాల ఎంబసీలు హెచ్చరికలు పంపాయి. దావోస్ లో కూడా వీటన్నింటిపై చర్చ జరిగింది. టిడిపి హయాంలో పెట్టుబడుల గమ్యస్థానంగా ఉన్న రాష్ట్రం గత ఏడాదిగా పెట్టుబడుల తిరోగమనం(రివర్స్) నెలకొనడం బాధాకరం'' అన్నారు. 

''గవర్నమెంట్ టెర్రరిజం ఉందని, బీహార్ ఆఫ్ సౌత్ గా ఏపి మారిందని పారిశ్రామిక వేత్తల వ్యాఖ్యలకు ఈవిధమైన చర్యలు మరింత ఊతం ఇచ్చేలా ఉన్నాయి. ఇకనైనా ఇటువంటి వేధింపులకు, కక్ష సాధింపునకు సీఎం జగన్మోహన్ రెడ్డి స్వస్తి చెప్పాలి'' అని చంద్రబాబు హెచ్చరించారు. 

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu