త్వరలో అసెంబ్లీకి కొత్త కార్యదర్శి

First Published Aug 26, 2017, 8:18 AM IST
Highlights
  • నిజానికి కార్యదర్శిగా పనిచేయటానికి అసెంబ్లీలోనే అర్హలున్నారు.
  • పైగా పదోన్నతి కోసం దాదాపు ఐదేళ్ళుగా ఎదురుచూస్తున్నారు.
  • అసెంబ్లీ సర్వీసులోనే ఉన్న వారిని తీసుకుంటే వారికి పదోన్నతులు కల్పించినట్లూ అవుతుంది,
  • వెలుపలి వ్యక్తుల అవసరమూ ఉండదు.
  • కానీ వారెవరిని నియమించటానికి స్పీకర్ ఇష్టపడటం లేదు. అందుకనే ఇపుడు కూడా బయటవ్యక్తుల కోసమే వెతుకుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ పద్దతి ‘చంకలో పిల్లాణ్ణి పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నట్లు’గా ఉంది. అసెంబ్లీ సర్వీసులోనే అర్హులైన అధికారులు ఉన్నా కార్యదర్శులుగా పనిచేయటానికి బయట వ్యక్తులే స్పీకర్ కు ముద్దొస్తున్నారు. ఇదంతా ఇప్పుడెందుకంటే, అసెంబ్లీ కార్యదర్శిగా పనిచేయటానికి తగిన వ్యక్తి కోసం స్పీకర్ వెతుకుతున్నారు. ఇప్పుడు కార్యదర్శిగా కాంట్రాక్ట్ పై ఉన్న పిపికె రామాచార్యులు తిరిగి ఢిల్లీ వెళ్ళిపోవాలని అనుకోవటమే కారణం. ఢిల్లీ అసెంబ్లీలో పనిచేస్తున్న ఓ అధికారి కొత్త కార్యదర్శిగా వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.

రాష్ట్ర విభజన తర్వాత ఏపి అసెంబ్లీకి పూర్తిస్ధాయి కార్యదర్శి లేరు. అందుకే దాదాపు మూడేళ్ళు ఇన్ఛార్జ్ కార్యదర్శి సత్యనారాయణతోనే నిడిపేసారు. అయితే, ఇన్ఛార్జ్ కార్యదర్శికి కార్యదర్శి అవటానికి అర్హతలు లేవు.  అంతేకాకుండా వైసీపీ సభ్యులపై అధికారపక్షం తీసుకున్న అనేక వివాదాస్పద నిర్ణయాల వెనుక సత్యనారాయణ ప్రోద్భలం కూడా ఉందనే అరోపణలున్నాయి. పైగా సత్యనారాయణపై కోర్టులో కేసులున్నాయి.

దాంతో సత్యనారాయణను తప్పించి ఢిల్లీలో రాజ్యసభ అడిషినల్ కార్యదర్శిగా పనిచేస్తున్న పిపికె ఆచార్యులను కార్యదర్శిగా తెచ్చుకున్నారు. నిజానికి శాసనమండలి ఉద్యోగుల సర్వీసు నిబంధనల ప్రకారం ఆచార్యుల నియామకం సాధ్యంకాదు. కానీ నిబంధనలను పక్కకు పెట్టి రెండు మాసాల క్రితమే ఆచార్యులను నియమించారు.

అయితే, వెంకయ్యనాయడు ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు తీసుకోగానే ఆయన సిబ్బందిగా వెళ్లిపోవాలని ఆచార్యులు అనుకున్నారు. దాంతో తనను రిలీవ్ చేయాల్సిందిగా స్పీకర్ ను ఆచార్యులు కోరటం అందుకు స్పీకర్ అంగీకరించటం అన్నీ అయిపోయింది. ప్రధాన కార్యదర్శి ఆమోదమే మిగిలివుంది. దాంతో మళ్ళీ కొత్త కార్యదర్శిని నియమించాల్సి వచ్చింది.  

నిజానికి కార్యదర్శిగా పనిచేయటానికి అసెంబ్లీలోనే అర్హలున్నారు. పైగా పదోన్నతి కోసం దాదాపు ఐదేళ్ళుగా ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ సర్వీసులోనే ఉన్న వారిని తీసుకుంటే వారికి పదోన్నతులు కల్పించినట్లూ అవుతుంది, వెలుపలి వ్యక్తుల అవసరమూ ఉండదు. కానీ వారెవరిని నియమించటానికి స్పీకర్ ఇష్టపడటం లేదు.

అందుకనే ఇపుడు కూడా బయటవ్యక్తుల కోసమే వెతుకుతున్నారు. బహుశా ఢిల్లీ అసెంబ్లీ కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రసన్నకుమార్ కొత్త కార్యదర్శిగా రావచ్చని తెలుస్తోంది. కాకపోతే ప్రసన్న తెలంగాణాలోని ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి. చంద్రబాబునాయుడుకు బాగా సన్నిహితుడైన ఓ నేత ప్రసన్న తరపున గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

click me!