అధికార వైసీపీకి మరో నేత గుడ్ బై.. తెలుగు దేశం పార్టీ ఎంపీతో సమావేశం వెనుక ఉద్దేశం అదేనా ?

By team teluguFirst Published Jan 11, 2023, 12:54 PM IST
Highlights

ఏపీ అధికార పార్టీ వైసీపీ నుంచి మరో నేత బయటకు వెళ్తారని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఓ ఎమ్మెల్యే తండ్రి ఇటీవల టీడీపీ ఎంపీతో సమావేశం కావడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. 

ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార వైసీపీలో పలువురు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తుడంటం అధినేత వైఎస్ జగన్ కు తీవ్ర తలనొప్పిగా మారాయి. రాష్ట్రంలో పాలనపై పార్టీపై సొంత నాయకులే ఇలా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆయనకు ఆందోళన కలిగిస్తోంది. ఇలా పార్టీపై వ్యాఖ్యలు చేసిన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిపై కొంత కాలం కిందట వేటు వేశారు. కానీ అలాగే మరి కొందరు నాయకులు కూడా ప్రవర్తిస్తుండటంతో పార్టీ అధినేతకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. 

కృష్ణా జిల్లాలోని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సొంత పార్టీపై బాహాటంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది కూడా వైసీపీ అధినాయకుడికి తలనొప్పి వ్యవహారంలా మారింది. సోమవారం ఆయన తన తండ్రి వసంత నాగేశ్వరరావు టీపీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ తో భేటి అయ్యారు. ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. కొంత కాలం నుంచి కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో వీరి భేటీ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. వైసీపీలో తన కుమారుడికి ప్రియారిటీ ఇవ్వడం లేదనే నాగేశ్వర రావు టీడీపీ ఎంపీతో చర్చలు జరిపారని వార్తలు వెలువడ్డాయి. 

అయితే ఈ భేటీపై ఇలా వార్తలు రావడంతో వసంత నాగేశ్వర రావు స్పందించారు. తమ భేటీలో రాజకీయ కోణం లేదని అన్నారు. నాని కూతురు పెళ్లికి హాజరు కాలేకపోయినందుకే సోమవారం వెళ్లి కలిశానని చెప్పారు. తమ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి సంబంధించిన పలు వివరాలు అందించానని, వాటి కోసం నిధులు కేటాయిస్తానని చెప్పారని, దీనికి ఆయన కు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. నాగేశ్వర రావు ఇలా వివరణ ఇచ్చినప్పటికీ ఈ భేటీ వెనక రాజకీయ కోణం ఉందని చర్చలు జరుగుతున్నాయి. 

కానీ వసంత కృష్ణ ప్రసాద్ మాత్రం అధికార పార్టీపై బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తుండటం కొనసాగిస్తున్నారు. మంగళవారం కూడా ఆయన పార్టీని విమర్శించారు. తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. వైసీపీలోని పలువురు నాయకులపై అసంతృప్తి ఉందని చెప్పారు. తనకు రౌడీలను వెంటేసుకొని తిరగడం చేతకాదని తెలిపారు. అందుకే తాను కిందటి తరం పొలిటీషియన్ గా మిగిలిపోయానని అన్నారు. ఎన్నో ఏళ్లుగా తమ కుటుంబం పాలిటిక్స్ లో ఉందని, కానీ ఇలాంటి పాలిటిక్స్ ఎప్పుడూ చూడలేదని అన్నారు. ప్రస్తుత పాలిటిక్స్ లో అనేక మార్పులు వచ్చాయని అన్నారు. 

ప్రస్తుతం రౌడీలు వెనకాల ఉంటేనే ముందుకు వెళ్లవచ్చని తెలిపారు. లేకపోతే ముందుకు వెళ్లలేమని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పాలిటిక్స్ లోకి ఎందుకు వచ్చానా అని పలు సందర్భాల్లో అనిపిస్తుందని, బాధగా ఉంటుందని తెలిపారు. సాధారణ ప్రజల కూడా సాయం చేయలేకపోతున్నాని చెప్పారు. ఈ వ్యాఖ్యలు అధికార వైసీపీని కలవరపెట్టాయి. వెంటనే అప్రమత్తమై వసంత కృష్ణప్రసాద్‌ను ఆ పార్టీ నేతలు కలిశారు. ఆయనతో భేటీ అయి పలు విషయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. 

గుంటూరు జిల్లాలో టీడీపీకి చెందిన ఎన్నారై శ్రీనివాసరావు పేదలకు చీరలు పంపిణీ చేశారు. అయితే ఈ కార్యక్రమంలో ముగ్గురు మహిళలు మరణించారు. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. రాష్ట్రంలో ఎవరూ సభలు, ర్యాలీలు నిర్వహించకూడదని చెప్పింది. దీనికి సంబంధించి ఓ జీవో కూడా విడుదల చేసింది. ఈ ఘటనపై ఎవరూ వైసీపీ నాయకులు కూడా మాట్లాడకూడదని చెప్పినట్టు సమాచారం. కానీ దీనిని పట్టించుకోకుండా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఓ కార్యక్రమంలో గుంటూరు ఘటనపై మాట్లాడారు. ఎన్నారై సేవలను కొనియాడారు. ఆ సమయంలో జరిగిన ఘటనను అనవసరంగా పెద్దదిగా చేస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా చేస్తే ఎన్నారైలు సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకురారని తెలిపారు. ఇక్కడి నుంచే వైసీపీలో అంతర్గత పోరు ఉందని బయటకు తెలిసింది. దీంతో ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతారని, టీడీపీలో జాయిన్ అవుతారని చర్చలు మొదలయ్యాయి. 

tags
click me!