చిరువ్యాపారుల పెట్టుబడికి భరోసా కల్పిస్తున్నాం: జగనన్న తోడు నిధులను విడుదల చేసిన సీఎం జగన్

By Sumanth KanukulaFirst Published Jan 11, 2023, 12:44 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం జగనన్న తోడు పథకం కింద రుణాలు, వడ్డీ మాఫీ నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 3.95 లక్షల మంది చిరువ్యాపారులకు కొత్తగా రూ.395 కోట్ల రుణాలు అందిస్తున్నామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం జగనన్న తోడు పథకం కింద రుణాలు, వడ్డీ మాఫీ నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 3.95 లక్షల మంది చిరువ్యాపారులకు కొత్తగా రూ.395 కోట్ల రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటిదాకా 15,31,347 మందికి.. రూ.2,406 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించినట్లు వివరించారు. తన పాదయాత్ర సమయంలో చిరు వ్యాపారుల బాధలను దగ్గరుండి చూశానని చెప్పారు. చిరు వ్యాపారులు వాళ్ల కష్టంపైనే ఆధారపడతారని.. అందుకే వాళ్లకు అండగా నిలిచామని తెలిపారు. 

అందుకే చిరువ్యాపారుల పెట్టుబడికి భరోసా కల్పిస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. చిరు వ్యాపారుల జీవనోపాధికి అండగా జగనన్న తోడు పథకం నిలుస్తోందని.. ఒక్కో వ్యాపారికి ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రూ.10వేల వరకు వడ్డీలేని రుణం అందిస్తున్నామని తెలిపారు. చిరువ్యాపారులకు ఇచ్చే రుణాలపై పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లో ఈరోజే ఈ వడ్డీని జమ చేస్తున్నామని చెప్పారు. అర్హత ఉండి కూడా పథకం అందుకోని వారు ఉంటే.. వారికి కూడా లబ్ధి చేకూరుస్తామని స్పష్టం చేశారు. 

గత ఆరు నెలలకు సంబంధించి రూ. 15.17 కోట్లు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ చేసినట్లు తెలిపారు. లబ్ధిదారుల్లో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారని అన్నారు. గడువులోగా డబ్బులు చెల్లిస్తే బ్యాంక్‌లు తిరిగి రుణాలు ఇస్తాయని చెప్పారు. ఇక, తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ నిధులు విడుదల కార్యక్రమంలో పాల్గొనగా.. వివిధ జిల్లాల కలెక్టరేట్ల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
 

click me!