ఒకే రాజధాని అమరావతి అయితే.. మా రాష్ట్రం అక్కడ ఉండకూడదు: మంత్రి ధర్మాన ప్రసాదరావు

By Sumanth KanukulaFirst Published Jan 11, 2023, 9:59 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి కీలక వ్యాఖ్యలు  చేశారు. అమరావతిని రాజధానిగా చేస్తే తమ రాష్ట్రం అక్కడ ఉండకూడదని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి కీలక వ్యాఖ్యలు  చేశారు. అమరావతిని రాజధానిగా చేస్తే తమ రాష్ట్రం అక్కడ ఉండకూడదని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పొట్టి శ్రీరాములు మున్సిపల్ మార్కెట్‌లో సీసీ రోడ్డును మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ..  ఉత్తరాంధ్ర ప్రజల కోసం గొంతెత్తడం ఆపనని చెప్పారు. తన ప్రాంత ప్రజల కోసం ఎక్కడివరకైనా వెళ్తానని తెలిపారు. అధికార పార్టీ అన్యాయం చేసినా ఊరుకోనని స్పష్టం చేశారు. 

‘‘చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే అమరావతినే రాజధాని చేస్తామని అంటారు. ఒకే రాజధాని అమరావతిలో పెట్టుకుంటే దానిపై మాకేం అభ్యంతరం లేదు. కానీ మా రాష్ట్రం అక్కడ ఉంటే మాత్రం మేము ఒప్పుకోం. విశాఖపట్నం ప్రత్యేక రాష్ట్రం కావాల్సిందే. శ్రీకాకుళంలో రూ.కోటి ఖర్చుతో రోడ్డు వేస్తేనే అందరూ ఇంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 80 ఏళ్ల తర్వాత ఈ పరిస్థితులు శ్రీకాకుళంలో ఉన్నప్పటికీ నోర్మూసుకుని ఉంటే మేము అసెంబ్లీకి ఎందుకు వెళ్లాలి?. ప్రభుత్వంలో ఎందుకు ఉండాలి?’’ అని ధర్మాన ప్రసాదరావు అన్నారు. 

Latest Videos

ధర్మాన ప్రసాద రావు భూములు దొబ్బేశాడని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రెవిన్యూ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నా సెంటు భూమి ఇచ్చే అధికారం కూడా తనకు లేదన్నారు. అలాంటిది రెవెన్యూ మంత్రిగా భూములు కొట్టేసే అవకాశం తనకు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. రాష్ట్ర క్యాబినెట్ మాత్రమే ఎవరికైనా భూములు ఇవ్వగలదని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఏ పనికైనా నయా పైసా ప్రతిఫలం తీసుకున్నట్లు రుజువు చేస్తే.. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్‌ విసిరారు.

click me!