గ్రానైట్ లారీల్లో మద్యం అక్రమ రవాణా... గోవా, తెలంగాణ నుండి ఏపీకి

By Arun Kumar PFirst Published Sep 22, 2020, 9:23 PM IST
Highlights

తెలంగాణ, గోవా రాష్ట్రాలకు చెందిన భారీ మద్యాన్ని ఏపీకి అక్రమంగా తరలిస్తుండగా గుంటూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. 

గుంటూరు: తెలంగాణ, గోవా రాష్ట్రాలకు చెందిన భారీ అక్రమ మద్యాన్ని ఏపీకి తరలిస్తుండగా గుంటూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు గుంటూరు మండలంలోని పలకలూరు, శావల్యపురం మండలంలోని కారుమంచి గ్రామాల్లో మాటువేసిన పోలీసులు తెలంగాణ, గోవా రాష్ట్రాలకు చెందిన 4,764 బాటిళ్ల అక్రమమద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న మద్యం విలువ రూ.13.58 లక్షలు వుంటుందని అంచనా. 

ఈ అక్రమ మద్యం రవాణాకు సంబంధించిన వివరాలను గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి, ఎస్ఈబీ ఏఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వెల్లడించారు. గ్రానైట్ లారీల ద్వారా మద్యం తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాసరావుపై పీడీ చట్టం ప్రయోగిస్తామని అన్నారు. 

అక్రమ మద్యం, ఇసుక రవాణాపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని ఎస్పీ అమ్మిరెడ్డి హెచ్చరించారు. కాబట్టి ప్రజలు పోలీసులకు సహకరించి అక్రమమద్యానికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ధరలు భారీగా పెరగడంతో తెలంగాణ నుంచి మద్యం అక్రమ రవాణా పెరిగిపోతోంది. సరిహద్దు జిల్లాల నుంచి లక్షల రూపాయల మద్యం తెలంగాణ నుండి ఏపీకి నిత్యం అక్రమంగా తరలుతోంది. ఇటీవల ఇదే గుంటూరు జిల్లాలో రెంటచింతల మండలంలోని సత్రశాల వద్ద సుమారు 1.6 లక్షల విలువైన అక్రమ మద్యం పట్టుబడింది. 

ఓ ట్రాక్టర్ లో తెలంగాణ నుంచి 1200 వందల బాటిళ్లను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు మెరుపుదాడి చేసి పట్టుకున్నారు. దీంతో మద్యం బాటిళ్ళతో పాటు వాటిని తరలిస్తున్నవారు పట్టుబడ్డారు. 

 ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీహరిబాబు మాట్లాడుతూ... అక్రమంగా మద్యం రవాణా చేసి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. మద్యం రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  డబ్బులకు ఆశపడి అక్రమ మద్యం రవాణా బాటను ఎంచుకుంటున్నారని... ఎక్సైజ్‌ తదితర కేసులలో పట్టుబడితే రౌడీషీట్లు తెరిచే అవకాశముందని హెచ్చరించారు. 

''నిరుద్యోగులు అక్రమార్కుల వలలో చిక్కుకోవద్దని, వారి ఉజ్వల భవిషత్తును నాశనం చేసుకోవద్దని కోరుతున్నాం. అలానే అక్రమ రవాణా విషయం తెలిసిన వారు తమకు సమాచారం ఇస్తే, వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం'' అని డీఎస్పీ తెలిపారు.  

click me!