అలా చేస్తే జగన్ కే ప్రమాదం... జాగ్రత్త: హెచ్చరించిన చంద్రబాబు

By Arun Kumar PFirst Published Sep 22, 2020, 8:33 PM IST
Highlights

ఏపీలో దేవాలయాల రథాలకు నిప్పు, దేవుళ్ల విగ్రహాల ధ్వంసం, అన్య మత ప్రచారం, మత మార్పిళ్లతో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. 

గుంటూరు: దేవాలయాలపై దాడులను ఇలాగే వదిలేస్తే రేపు చర్చిలపై, మసీదులపై దాడులకు తెగిస్తారని టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా టిడిపి నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ...రాష్ట్రాన్ని అగ్నిగుండంగా చేయాలని వైసిపి నాయకులు చూస్తున్నారని ఆరోపించారు. వైసిపి అధికారంలోకి వచ్చాక ఆలయాల్లో అరాచకాలు పేట్రేగిపోయాయని... వారి అకృత్యాలకు అంతే లేకుండా పోయిందన్నారు. తిరుమల తిరుపతి, శ్రీకాళహస్తి, కాణీపాకం, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, అంతర్వేదితో సహా ప్రతి పుణ్యక్షేత్రంలో అరాచకాలు పెరిగిపోయాయని మండిపడ్డారు.

''దేవాలయాల రథాలకు నిప్పు, దేవుళ్ల విగ్రహాల ధ్వంసం, అన్య మత ప్రచారం, మత మార్పిళ్లతో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు. ఇన్ని అరాచకాలు జరుగుతోన్నా వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దోషులపై ఎటువంటి  చర్యలు లేకపోవడంతో నేరగాళ్ల ఆగడాలు మితిమీరాయి. తిరుమల తిరుపతి పవిత్రత కాపాడాలి. సనాతన ఆచారాలు, సంప్రదాయాలను కాపాడాలి. ఎన్టీఆర్ హయాంలో అన్నదానం ప్రారంభించాం. ఆ తర్వాత మన హయాంలో ప్రాణదానం ప్రారంభించాం. ఎన్టీఆర్ అయినా, నేనైనా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారానే దర్శనానికి వెళ్లేవాళ్లం'' అని గుర్తుచేశారు. 

read more  సబ్ కాంట్రాక్టర్ కీలక వాంగ్మూలం: లాక్‌డౌన్‌లో వెండి సింహాల చోరీ, పోలీసుల నిర్థారణ..?

''కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. స్వామివారి మహిమలకు నేనే ప్రబల సాక్ష్యం. 24క్లెమోర్ మైన్ల పేలుళ్ల నుంచి నన్ను కాపాడింది వెంకటేశ్వర స్వామి వారే..కారులో నలుగురుంటే నలుగురినీ కాపాడారు. ఏడుకొండల వాడితో పెట్టుకుంటే అంతే సంగతులు. స్వామివారి పట్ల అపచారం చేస్తే, వ్యక్తికే కాదు సమాజానికే ప్రమాదం. ఏ ఆలయానికి ఆ ఆలయం మర్యాదలు ఉంటాయి. ప్రత్యేక ఆచారాలు ఉంటాయి, సంప్రదాయాలు ఉంటాయి. వాటిని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది'' అన్నారు. 

''వాటికన్ సిటి లాంటిది తిరుమల తిరుపతి. భక్తుల నమ్మకాన్ని చులకన చేయరాదు, వాళ్ల విశ్వాసాన్ని చిన్నబుచ్చరాదు. అపచారాలు చేయడానికి కాదు అధికారంలోకి వచ్చింది. సమాజానికి అరిష్టం చేయడానికి కాదు అధికారంలోకి వచ్చింది. భక్తుల మనోభావాలతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదు. రాజకీయ దురుద్దేశాలతోనే ఆలయాల్లో అపచారాలకు పాల్పడుతున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు. మదం ఎక్కిన ఏనుగు మాదిరిగా వ్యవహరిస్తున్నారు. అన్యమతస్థుడైన దేశాధ్యక్షుడే డిక్లరేషన్ ఇచ్చారు. కేంద్ర మంత్రులు డిక్లరేషన్ ఇచ్చారు. అన్యమతస్థుడైన ముఖ్యమంత్రి డిక్లరేషన్ ఇస్తే తప్పేంటి..?'' అని ప్రశ్నించారు. 

''జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ కోసం పట్టుబట్టాలి. డిక్లరేషన్ ఇచ్చాకే తిరుమల గుళ్లో అడుగుపెట్టాలి. బ్రహ్మోత్సవాల్లో ఒంటరిగా పట్టువస్త్రాలిస్తే అతనికే కాదు, రాష్ట్రానికే అరిష్టం. 
మత ఆచారాలను కించపర్చరాదు. ఇతర మతాలను చులకన చేయరాదు. చట్టపరంగా ఎన్నికైన సీఎం చట్ట ఉల్లంఘనలు చేయరాదు. ఆ చట్టాన్నే తీసేస్తామని మంత్రి, బోర్డు ఛైర్మన్ లతో చెప్పిస్తున్నారు. చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే ఏ స్థాయిలో వారైనా దోషులే..బాధ్యతగల ముఖ్యమంత్రి చట్ట ఉల్లంఘనలకు పాల్పడరాదు. దేవుడి పట్ల వైసిపి చేసే అపచారాలకు, టిడిపి నిరసనలు తెలపాలి. జిల్లా వ్యాప్తంగా అన్నిచోట్ల నిరసనలు జరపాలి. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ కోసం పట్టుబట్టాలి'' అని ఈ టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు పిలుపునిచ్చారు. 
 

click me!