
నూజివీడు: కృష్ణా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నూజివీడు ట్రిపుల్ ఐటీ (nuzividu iiit)లో చదువుతున్న విద్యార్థిణి మారడపు హారిక హాస్టల్ భవనంపై నుండి దూకి ఆత్మహాత్యాయత్నానికి పాల్పడింది. విద్యార్థిని భవనంపైనుండి దూకిన నాలుగైదు గంటల తర్వాత సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి హాస్టల్ సిబ్బందికి సమాచారమిచ్చాడు. అప్పటికే తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువతిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే... తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని కొత్తపేటకు చెందిన హారిక నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అయితే ఏమయ్యిందో తెలీదుగానీ శనివారం అర్ధరాత్రి హారిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తోటి విద్యార్థులందరూ పడుకున్న తర్వాత హాస్టల్ బిల్డింగ్ మూడవ అంతస్తు పైకి చేరుకున్న ఆమె కిందకుదూకింది. దీంతో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.
ఇలా హారిక కొన ఊపిరితో రక్తపుమడుగులో నాలుగైదు గంటలు పడివుంది. చివరకు తెల్లవారుజామున హాస్టల్ కు పాలను సరఫరాచేసే వ్యాన్ డ్రైవర్ యువతి పడివుండటాన్ని గమనించి సెక్యూరిటీ సిబ్బందికి సమాచారమిచ్చాడు. వారు వెంటనే హాస్టల్ సిబ్బందికి తెలియజేయగా వెంటనే అంబులెన్స్ లో దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. ట్రిపుల్ ఐటీ అధికారులు యువతి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
అయితే హారిక వెన్నెముక, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయినట్లు డాక్టర్లు తెలిపారు. పరిస్థితి విషమంగా వుండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. మల్టిపుల్ ఫ్యాక్ఛర్స్ అయినప్పటికి యువతి ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలియజేసారు.
యువతి ఆత్మహత్యాయత్నంపై నూజివీడు ట్రిపుల్ ఐటీ ఏవో భాను కిరణ్ మాట్లాడుతూ... ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో యువతి కొన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయినట్లు... ఇదే ఆమె ఆత్మహత్యకు కారణమై వుంటుందని తెలిపారు. పరీక్ష ఫలితాలపై గత రాత్రే విద్యార్థులకు అవగాహన కల్పించామని తెలిపారు. విద్యార్థులెవ్వరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని... ఫెయిల్ అయిన సబ్జెక్టులకు మరోసారి పరీక్ష పెడతామని చెప్పామని ఏవో వివరించారు.
హారిక ఆత్మహత్యాయత్నంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అవడమే కారణమా లేక ఇంకేమయినా కారణాలున్నాయా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
ఇదిలావుంటే ఈ నెల(మార్చి) 4వ తేదీన ఇదే నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో మందాల రామునాయుడు(16) ఆత్మహత్య చేసుకున్నాడు. విజయనగరం జిల్లాకు చెందిన యువకుడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లోనే వుండి చదువుకునేవాడు. అతడు హాస్టల్ గదిలోనే ఉరేసుకుని చనిపోగా సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి క్యాంపస్ అధికారులు సమాచారమిచ్చారు. నెల రోజుల వ్యవహదిలోనే మరో యువతి ఆత్మహత్యచేసుకోవడంతో అసలు క్యాంపస్ లో ఏం జరగుతుందో ఎవ్వరికీ అర్థంకావడం లేదు. చదువుల ఒత్తిడితోనే విద్యార్థులు చనిపోతున్నారా లేక మరేమయినా కారణాలున్నాయా అన్నది తేలాల్సి వుంది.