
ఆంధ్రప్రదేశ్ లో కనివిని ఎరుగని స్థాయిలో ఒక భూ కుంభకోణానికి తెర తీస్తున్నారు. ప్రభుత్వం అధీనంలో ఉన్న లక్షలాది ఎకరాల ’చుక్కల భూము’లను ’రైతు’ లకు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతూ ఉంది. గత పదో, పదిహేనో సంవత్సరాలుగా తాము సాగు చేసుకుంటున్నామని ఏదో ఒక విధంగా సాక్ష్యం పుట్టిస్తే ఆ ’రైతు’ పేరు మీద ఈ భూమికి పట్టాదార్ పాస్ పుస్తకం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించింది.
పాస్ పోర్టులు, భూమి ఒరిజినల్ డాక్యుమెంట్లు, రుపాయ నోట్లు కూడా నకిలీవి సృష్టిస్తున్న ఈ రోజులలో ఫలానా భూమి నాదేనని మౌఖికంగా రుజు వు చేయడం గొప్ప విషయం కాదు.
అందునా ప్రభుత్వం అండదండలున్నపుడు ఇలాంటి సాక్ష్యాలు వందల్లో పుట్టించడం నిమిషాల్లో జరిగే పని. తెలుగు దేశం ప్రభుత్వానికి అనుకూలమయిన ’రైతు’ లకు, రైతులాంటి వాళ్లకు భారీగా భూకానుక లభించ నుంది.
’రైతులు’ అందుబాటులో లేనపుడు బినామీలను సృష్టించి ప్రభుత్వ కార్యం పూర్తి చేసేందుకు పాలక వర్గం క్రియాశీల కార్యకర్తలు, నాయకులు ఉండనే ఉన్నారు.
చుక్కల భూములంటే ఏమిటో తెలుసా?
ఎపుడో 1924 లోనో, లేదా 1946 లోనో రెవిన్యూ వాళ్ల ఒక సర్వే చేశారట. ఆసర్వే జరుపుతున్నపుడు కొన్ని చోట్ల భూముల యజమాని అందుబాటులో లేడని యజమాని కాలమ్ నింపకుండా చుక్కలు పెట్టారు. ఇలాంటి చుక్కలు పెట్టిన భూములే చుక్కల భూములు. రెవిన్యూ వాళ్ల వాడుకలో ఇవి ’డాటెడ్ ల్యాండ్స్’. ఇపుడు తెలుగుదేశం నాయకులు సిఫార్సు చేసిన వారి పేరును ఈ కాలం లో రాస్తారు.
గతంలో ఏ ప్రభుత్వం కంట పడని ఈ భూములు ఇపుడు తెలుగుదేశం కంట పడ్డాయి. ఈ భూములను పంపణీ చేస్తే, ’రైతు’లు బాగు పడతారు, పార్టీ కూడా బాగుపడుతుందని ప్రభుత్వం భావించింది. సీనియర్ రెవిన్యూ అధికారులు వివరాలందించారు. ఈ భూములను ప్రభుత్వ పెద్దలు చెప్పినోడికల్లా రాసిచ్చి మంచి పేరు తెచ్చకునేందుకు జాయింట్ కలెక్టర్లు ఉవ్విళ్లూరు తున్నారు. అంతే, ఈ భూముల లెక్కలు బయటకు తీశారు.
ఇవే లెక్కలు: తూర్పు గోదావరి జిల్లాలో 14.49 వేల ఎకరాలు. కృష్ణాలో 22.65 వేలు, గుంటూరులో 71.01 వేలు, చిత్తూరు59.54 వేలు, ప్రకాశంలో 2.95 లక్షల ఎకరాలు, కడపలో 2.87 వేలు, నెల్లూరు లో 3.61 లక్షలు, కర్నూలు లో4.27 లక్షలు, అనంతపురంలో 8.63 లక్షల ఎకరాలు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలలో ఇలాంటి భూములు లేవు అని చెబుతున్నారు.
ఇవన్నీ ప్రభుత్వ భూములు. ఇవి చుక్కల భూములెలా అయ్యాయో తెలియదు. వీటిలో కొన్నింటికి అక్కడక్కడా పాస్ పుస్తకాలిచ్చరని అధికారులు చెబుతున్నా. మరికొన్ని చోట్ల అసైన్ చేసినట్లు చూపిస్తున్నారు. మిగ తా భూములను ఇపుడు ’రైతు’లకు ఇచ్చేందుకు రంగం సిద్ధమయింది.
తొందర్లో ఒక సర్వే చేసి రైతులను గుర్తిస్తారు.దున్నేవాడికి భూమి దక్కాలన్నది చాలా పాత కాలం నినాదం. ఇపుడుది కబ్జాదారుడిదే భూమి గా మారి పోయింది. చుక్కల భూముల వ్యవహారం కూడా కబ్జాదారుడు ముందుకొచ్చి ఈ భూములెక్కడ ఉన్నాయో సర్వే నంబర్లు సంపాయించి తమదేనని దబాయిస్తే చాలు, పాస్ బుక్ వచ్చేస్తుంది.
ఆర్డీవోలకు ( సాధారణంగాతమ కిష్టమయిన వారిని స్థానిక నాయకులు పట్టుబట్టి పొస్టింగ్ వేయించుకుంటుంటారు) కలెక్టర్ అధికారాలు ఇచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు పూర్తయితే, తమ కిష్టమయిన ప్రతి ’రైతు’కు రాజకీయా నాయకులు పట్టాదార్ పాస్ పుస్తకంఇప్పించే పరిస్థతి వస్తుంది.
చుక్కల భూములను అందరికీ పంచేస్తే, ఇక రాష్ట్రంలో ఎక్కడ ఒక అంగుళం ప్రభుత్వ భూమి మిగలదని రెవిన్యూ అధికారి ఒకరు ’ఏషియానెట్ ’ కు తెలిపారు. అంతేకాదు, చుక్కల భూముల పంపిణీ దేశంలో ఇంతవరకు ఎక్కడ జరగనంతటి భూ కుంభకోణం కానుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భూకబ్జాలు కూడా ఈ చర్యతో రెగ్యులరైజ్ అయిపోతాయని ఆయన చెప్పారు. వచ్చే క్యాబినెట్ లో చుక్కల భూముల పంపిణీ పై తది నిర్ణయం తీసుకోనున్నారు.