విశాఖ శివారులో గ్యాస్ ట్యాంకర్ బీభత్సం... డివైడర్ పైకి దూసుకెళ్లి కరెంట్ స్తంభాలను ఢీకొట్టి..(వీడియో)

By Arun Kumar PFirst Published Mar 24, 2023, 11:07 AM IST
Highlights

విశాఖపట్నంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ లోడ్ తో వెళుతున్న ట్యాంకర్ అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లి విద్యుత్ స్తంభాలను ఢీకొట్టింది. 

విశాఖపట్నం : గ్యాస్ లోడ్ తో వెళుతున్న లారీ విశాఖపట్నం శివారులో బీభత్సం సృష్టించింది. జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో వెళుతున్న లారీ ముందు వెళుతున్న టిప్పర్ ను ఢీ కొట్టింది. దీంతో అదుపుతప్పిన లారీ డివైడర్ పైకి దూసుకెళ్లి విద్యుత్ స్తంభాలను ఢీకొట్టింది. అయితే లారీ ముందుభాగం మాత్రమే ధ్వంసమయి వెనక ట్యాంకర్ కు ఎలాంటి డ్యామేజ్ జరక్కపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 

శుక్రవారం తెల్లవారుజామున విశాఖపట్నంలో ఐఓసి నుండి గ్యాస్ లోడ్ తో చత్తీస్ ఘడ్ రాజధాని రాయ్‌పూర్ కు ఓ ట్యాంకర్ బయలుదేరింది. జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న లారీ కంచరపాలెం సమీపంలోని కప్పలాడ జంక్షన్లో అదుపుతప్పి ముందు వెళుతున్న టిప్పర్ ను ఢీకొట్టి డివైడర్ పైకి దూసుకెళ్లింది. అత్యంత ఘోరంగా ప్రమాదం జరిగినా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. గ్యాస్ ట్యాంకర్ దెబ్బతిని వుంటే మాత్రం పెను ప్రమాదం సృష్టించివుండేది. 

వీడియో

ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే కంచరపాలెం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్, ఎలక్ట్రికల్, సేప్టీ సిబ్బంది సహకారంలో ఎలాంటి ప్రమాదం జరక్కుంగా రక్షణ చర్యలు చేపట్టారు. ట్యాంకర్ లో గ్యాస్ నిండుగా వుందని...  ఇది లీకయి వుంటే ప్రమాద తీవ్రత అధికంగా వుండేదని తెలిపారు. గ్యాస్ ట్యాంకర్ డివైడర్ పైకి దూసుకెళ్లి ఆగి వుండకుండా బోల్తా పడివుంటే పెను ప్రమాదం సంభవించేదని అంటున్నారు. ఎలాంటి ఘోరం జరక్కపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. 

ప్రమాదంలో లారీ ముందుభాగం పూర్తిగా ధ్వంసమయ్యింది. లారీ డ్రైవర్ కు స్వల్ప గాయాలవడంతో అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తీసుకెళ్ళారు. అతడి నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాదానికి గురైన లారీ హైవే పైనే వుండటంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు భారీ క్రేన్ సాయంతో లారీని రోడ్డుపక్కకు తరలించారు.
 

click me!