గంటా ప్లాన్: బిజెపిలో చేరే టీడీపీ ఎమ్మెల్యేలు వీరే?

By telugu teamFirst Published Jun 22, 2019, 8:26 AM IST
Highlights

ప్రస్తుతం గంటా కొలంబోలో ఉన్నారు. చాలా రోజు క్రితం నుంచే గంటా శ్రీనివాస రావు బిజెపి నేతలతో సంబంధాలు నెరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, తాను బిజెపిలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని గంటా శ్రీనివాస రావు ఖండించారు. అయినప్పటికీ ఆ ప్రచారం ఆగడం లేదు. 

అమరావతి: బిజెపిలోకి వెళ్లేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు నాయకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. సుజనా చౌదరితో ఎప్పటికప్పుడు ఆయన సంప్రదింపులు జరుపుతూ బిజెపిలో చేర్చేందుకు టీడీపీ ఎమ్మెల్యేలను గంటా శ్రీనివాస రావు కూడగడుతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 

ప్రస్తుతం గంటా కొలంబోలో ఉన్నారు. చాలా రోజు క్రితం నుంచే గంటా శ్రీనివాస రావు బిజెపి నేతలతో సంబంధాలు నెరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, తాను బిజెపిలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని గంటా శ్రీనివాస రావు ఖండించారు. అయినప్పటికీ ఆ ప్రచారం ఆగడం లేదు. 

గంటా శ్రీనివాస రావుతో పాటు టీడీపీ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ (విశాఖ దక్షిణం), అన్నంగి సత్యప్రసాద్ (రేపల్లె), డోలా బాల వీరాంజనేయ స్వామి (కొండపి), వల్లభనేని వంశీ మోహన్ (గన్నవరం) తాము బిజెపిలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారంటూ ఓ ఆంగ్ల దినపత్రికలో వార్తాకథనం రావడం కలకలం సృష్టిస్తోంది. 

బిజెపిలో చేర్చడానికి గంటా శ్రీనివాస రావు మరింత మంది ఎమ్మెల్యేలను కూడగట్టడానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. ఫిరాయింపుల చట్టం నిబంధనలను అధిగమించడానికి మూడింట రెండు వంతుల మంది టీడీపీ ఎమ్మెల్యేలను కూడగట్టే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

వ్యాపారవేత్త అయిన గంటా శ్రీనివాస రావు ఇప్పటి వరకు మూడు పార్టీల్లో పనిచేశారు. తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన గంటా శ్రీనివాస రావు ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెసులో విలీనం చేసినప్పుడు ఆయన కాంగ్రెసులోకి వెళ్లారు. 

గంటా శ్రీనివాస రావు బిజెపి జాతీయ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారని, కొద్ది రోజుల్లో ఏదైనా జరగవచ్చునని బిజెపి నేతలు నమ్మకంగా చెబుతున్నారు.

click me!