100శాతం ఫెయిల్ ఏంటి సార్... కొంపదీసి ఇదీ ఎన్నికల హామీయేనా...: మాజీ విద్యామంత్రి గంటా ఎద్దేవా

Arun Kumar P   | Asianet News
Published : Jun 07, 2022, 11:27 AM IST
100శాతం ఫెయిల్ ఏంటి సార్... కొంపదీసి ఇదీ ఎన్నికల హామీయేనా...: మాజీ విద్యామంత్రి గంటా ఎద్దేవా

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ లో వెలువడిన పదో తరగతి ఫలితాల్లో చాలా తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదవడంపై మాజీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేసారు.

అమరావతి: నిన్న (సోమవారం) వెలువడిన ఆంధ్ర ప్రదేశ్ పదో తరగతి పలితాల్లో (AP SSC Results 2022) ఉత్తీర్ణతా శాతం చాలా తక్కవగా నమోదవడంతో జగన్ సర్కార్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యా సంస్కరణల పేరిట గందరగోళం, ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టకపోవడం వంటి కారణాలతోనే దాదాపు సగంమంది విద్యార్థులు ఉత్తీర్షత సాధించలేకపోయారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. తాజాగా మాజీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు (ganta srinivas rao) పదో తరగతి పరిక్షా పలితాలపై స్పందిస్తూ జగన్ సర్కార్ పై మండిపడ్డారు. 

''చదువురాని వాడు కాకరకాయ అంటే చదువువచ్చిన వాడు కీకరకాయ అన్నాడట. ఇంగ్లీష్ మీడియంలో చదివాక ఉన్నమతి పోయినట్టు... పదవ తరగతి పరీక్షల్లో 67 శాతం ఏంటి సర్? 71 పాఠశాలల్లో 100 శాతం ఫెయిల్ ఏంటి సర్? మీరేమైనా నిరక్షరాస్య రాష్ట్రం చేస్తామని ఎన్నికల్లో హామీ ఏమైనా ఇచ్చారా? ఇప్పటికే 95 శాతం ఎన్నికల హామీలు నెరవేర్చామని చెబుతున్నారు కదా, అలానే ఈ హామీని కూడా నెరవేర్చారా అనేది సందేహమే... సెటైర్ కాదు, ఏమీ అనుకోకండి'' అంటూ గంటా ఎద్దేవా చేసారు. 

''2015 లో 91.42 శాతం, 2016 లో 93.26 శాతం, 2017 లో 91.92 శాతం, 2018 లో 94.48 శాతం, 2019 లో 94.88 శాతం... ప్రతీ ఏడాదికేడాది స్థిరమైన, గణనీయమైన ప్రగతిని సాధించిన చరిత్ర కు పాతరేస్తూ నాణ్యమైన విద్యను అందించడంలో మొదటి నుంచి  మూడో స్థానం లో ఉన్న రాష్ట్రాన్ని చివరినుంచి మూడో స్థానానికి దిగజార్చేలా సాగుతున్న  మీ పాలనను సంస్కరించి మెరుగైన ఫలితాలు సాధిస్తారని ఆశిస్తున్నాం. నాడు-నేడు అని స్కూళ్ల రూపు రేఖలు మార్చామని చెబుతున్నారు కానీ విద్యార్థుల తలరాతలను కాలరాస్తున్నారు'' అంటూ ఆందోళన వ్యక్తం చేసారు. 

''టీచర్లకు ఇంగ్లీష్ లో ప్రావీణ్యం లేదు... 5 తరగతులకు ఒకే టీచర్, కిండర్ గార్డెన్ నుంచి 3 వరకు ప్రాథమిక విద్య అని, తర్వాత హై స్కూల్ అనీ, టీచర్లచేత పిల్లలకు పాఠాలు చెప్పడం మానిపించి బాత్ రూంల నుంచి, భోజనాలు వడ్డిస్తూ ఫోటోలు అప్లోడ్ చేయడం లో బిజీ గా మార్చిన మీ విధానాలను సమీక్షించండి సర్. ఒక్క డీఎస్సీ లేదు, ఒక్క ఓరియంటేషన్ లేదు, ఒక్క ప్రణాళిక లేదు, రాజకీయం చేస్తున్నామని అనుకోవద్దు, రాజీలేని ప్రయత్నం చేద్దాం. మా సహకారం కావాలన్నా అందించడానికి మాజీ విద్యాశాఖ మంత్రిగా సిద్ధంగా ఉన్నాం'' అని మాజీ మంత్రి గంటా పేర్కొన్నారు. 

అంతకుముందు పదో తరగతి పలితాల వాయిదాపై కూడా గంటా శ్రీనివాసరావు స్పందించారు. పదవతరగతి పరీక్షల ఫలితాలను ప్రకటించడంలోనూ ఆలస్యం, అయోమయం... ఎందుకింత గందరగోళం అంటూ వైసిపి ప్రభుత్వాన్ని నిలదీసారు. నిర్ణీత సమయానికి ఫలితాలు ప్రకటిస్తామని వాయిదా వేయడం అంటే చేతకానితనమే అంటూ మండిపడ్డారు. 

''అధికారులు ఎందుకు ఇంత అచేతనంగా మారుతున్నారు. మొన్నటివరకు రోజూ పేపర్ లీక్ వార్తలు, ఇప్పుడేమో ఫలితాలు ప్రకటించలేని నిస్సహాయత... ఇంతకీ ఫలితాల వాయిదాకి కారణం ఏంటి? అసమర్ధతనా? ఇంకేమైనా లోపాయికారీ వ్యవహారాలా?  విడుదల రోజే లోపం ఎక్కడ? బాధ్యత ఎవరిది?'' అంటూ నిలదీసారు. 

''గ్రేడ్ లు తీసి మార్కులు ప్రకటిస్తామని చెప్పారు ఓకే... ఇది ప్రభుత్వ విధానం అనుకుందాం.  అందులో తప్పొప్పుల ప్రస్తావన పక్కన పెడదాం. కనీసం ప్రభుత్వ ప్రతిష్ట కు సంబందించిన ఇలాంటి పరీక్షా ఫలితాల విడుదలనూ సకాలంలో చేయలేకపోతే ఇక మీపై భరోసా ఎలా ఉంటుంది? కనీసం మీకు మీరు సమర్థించుకోగలరా? గతంలో పరీక్షల నిర్వహణతో పాటు ఫలితాల తేదీని కూడా అకడమిక్ క్యాలెండర్ లోనే పొందుపరిచే వాళ్ళం? కచ్చితంగా అమలుచేసే వాళ్ళం.  ఇప్పుడెందుకు అలా చేయలేకపోతున్నారు? వివరించగలరా!'' అంటూ మాజీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసిపి ప్రభుత్వాన్ని నిలదీసారు. 


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!