అక్రమ కనెక్షన్లకు మద్దతు..ఎంఎల్ఏ నీరాహాదీక్ష బెదిరింపు

First Published Oct 27, 2017, 7:52 AM IST
Highlights
  • పట్టిసీమ కాల్వపై అక్రమంగా ఏర్పాటు చేసుకున్న మోటార్ల తొలగింపు వ్యవహారం టిడిపిలో చిచ్చు రేపుతోంది.
  • రైతులకు మద్దతుగా గన్నవరం ఎంఎల్ఏ వంశీమోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.
  • మోటార్ల కనెక్షన్లను తిరిగి పునరుద్ధరించకపోతే రైతులకు మద్దతుగా నిరాహార దీక్షకు కూడా సిద్ధమని హెచ్చరించటంపై పార్టీలో చర్చ జరుగుతోంది. 

పట్టిసీమ కాల్వపై అక్రమంగా ఏర్పాటు చేసుకున్న మోటార్ల తొలగింపు వ్యవహారం టిడిపిలో చిచ్చు రేపుతోంది. రైతులకు మద్దతుగా గన్నవరం ఎంఎల్ఏ వంశీమోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. మోటార్ల కనెక్షన్లను తిరిగి పునరుద్ధరించకపోతే రైతులకు మద్దతుగా నిరాహార దీక్షకు కూడా సిద్ధమని హెచ్చరించటంపై పార్టీలో చర్చ జరుగుతోంది. 

పోలవరం సమీపంలోని పట్టిసీమ దగ్గర నిర్మించిన లిఫ్ట్‌ ద్వారా ప్రభుత్వం గోదావరి జలాలను పోలవరం కుడి కాల్వ ద్వారా కృష్ణానదికి మళ్లిస్తోంది. పట్టిసీమ నుంచి నేరుగా కృష్ణానదిలో కలిసే గోదావరి జలాలు ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్న కాల్వల ద్వారా కృష్ణా జిల్లా మొత్తానికి సరఫరా అవుతాయి.

అయితే పట్టిసీమ కాల్వకు ఎగువన ఉన్న విజయవాడ రూరల్‌, బాపులపాడు, గన్నవరం మండలాలకు మాత్రం అందటం లేదు. గన్నవరం నియోజకవర్గంలోని ఈ మండలాలకు ప్రత్యామ్నాయ నీటి సదుపాయం కూడా లేకపోవడంతో రైతులు తమ పొలాల మీదుగా వెళుతున్న పట్టిసీమ కాల్వ నుంచి నేరుగా నీరు తమ భూములకు  అక్రమంగా మళ్లించుకుంటున్నారు.

ఇందుకవసరమైన మోటార్లు, ట్రాన్ఫఫార్మర్లు, వైర్లు తదితరాలను స్వయంగా గన్నవరం ఎమ్మెల్యే వంశీనే  అందించారు రైతులకు.  మూడు మండలాలలో దాదాపు 400 మోటార్లను వంశీ ఏర్పాటు చేయించారు. ఇవన్నీ అక్రమ కనెక్షన్న విషయం అందరకీ తెలుసు. సుమారు 50 వేల ఎకరాల ఆయకట్టు పట్టిసీమ కాల్వ మీద ఆధారపడి ఉండటం, వేలాది రైతులకు ఈ నీరే ఆధారం కావడంతో, ఇది అక్రమమైనప్పటికి, ప్రభుత్వంలోని ముఖ్యులకు తెలిసినా పట్టించుకోలేదు.

అందులోనూ పట్టిసీమ కాల్వ తవ్వకానికి అవసరమైన భూములను ఈ మూడు మండలాల రైతులు కూడా అందించారు. దాంతో వారేంచేసినా చెల్లుబాటవుతోంది. అయితే మోటార్ల ద్వారా నీటిని లిఫ్ట్‌ చేసేందుకు అవసరమైన విద్యుత్‌ను రైతులు ట్రాన్స్ కో విద్యుత్‌ లైన్‌లకు వైర్లు తగిలించి తీసుకుంటున్నారు. దీన్ని గమనించిన ట్రాన్స్ కో ఉన్నతాధికారులు అక్రమ మోటార్ల సర్వీసులన్నిటిని తొలగించారు. దాంతో ఎంఎల్ఏ అధికారులపై మండిపోతున్నారు.

మరో వారం రోజుల్లో పంట కోతకు వస్తుందనగా విద్యుత్‌ సరఫరా ఆగిపోవటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.  ఈ విషయంపైనే ట్రాన్స్ కో జిల్లా ఎస్‌ఈ వెంకటేశ్వర్లుకి ఫోన్‌ చేసి ఎమ్మెల్యే వంశీమోహన్‌ తీవ్రంగా హెచ్చరించారు. వేలాది ఎకరాల పంటపోయి, రైతులు పెట్టుబడులు నష్టపోతే బాధ్యత ఎవరిదంటూ నిలదీసారు.

ఎస్‌ఈ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతులు అక్రమంగా విద్యుత్‌ వాడుతున్న కారణంగా ట్రాన్స్‌కోకు భారీ నష్టం వస్తోందనే సర్వీసులు తొలగించామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే చూసి చూడనట్లు వదిలేస్తే మధ్యలో మీ బాధేంటని వంశీ నిలదీస్తున్నారు.

రైతులు చెల్లించాల్సిన విద్యుత్‌ బకాయిలు మొత్తం తానే చెల్లిస్తానంటూ ఎంఎల్ఏ చెప్పినా అధికారులు వినలేదు.  అక్రమంగా ఉపయోగించుకుంటున్న విద్యుత్‌కు బిల్లులు ఎలా కట్టించుకుంటామని ఎస్‌ఈ ప్రశ్నించారు. వ్యవసాయ సర్వీసు కనెక్షన్లకు దరఖాస్తు చేసుకుంటే వాటిని క్రమబద్ధీకరిస్తామని చెప్పారు.  ముందు కనెక్షన్లు పునరుద్ధరించి ఆ తరువాత బకాయిలు వసూలు చేసుకోమని ఎంఎల్ఏ చెప్పినా తొలగించిన విద్యుత్‌ కనెక్షన్లను అధికారులు పునరుద్ధరించలేదు.

దాంతో ‘మీరు ఇలాగే మొండి వైఖరితో వ్యవహరిస్తే నేను నిరాహార దీక్షకు కూర్చుంటానని’ వంశీ హెచ్చరించారు. బహుశా చంద్రబాబు శుక్రవారం సాయంత్రం విజయవాడకు చేరుకోగానే పంచాయితీ ఆయన ముందుకు వస్తుందేమో చూడాలి.

 

click me!