టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వల్లభనేని వంశీ. వర్థంతికి జయంతికి తేడా తెలియని వ్యక్తి పార్టీని నడుపుతున్నారని .. అలాంటి వ్యక్తి తన క్యారెక్టర్‌ను ప్రశ్నిస్తే పడేది లేదన్నారు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వల్లభనేని వంశీ. వర్థంతికి జయంతికి తేడా తెలియని వ్యక్తి పార్టీని నడుపుతున్నారని .. అలాంటి వ్యక్తి తన క్యారెక్టర్‌ను ప్రశ్నిస్తే పడేది లేదన్నారు.
తాను చంద్రబాబుతో మాట్లాడి ఐదు నెలలు గడిచిపోయిందని పత్రికల్లో వార్తలు ప్రచురించారని దీనిపై ఆయన్నే ప్రశ్నించానన్నారు. తనపై తప్పుడు వార్తలు ఎవరు రాయిస్తున్నారో కూడా తెలియనంత అమాయకుడిని కాదని వంశీ స్పష్టం చేశారు. బ్లాక్‌మెయిల్ చేసి పార్టీలో ఉంచుకుంటారా.. క్యారెక్టర్‌ని ప్రశ్నిస్తారా అంటూ ఆయన మండిపడ్డారు.
మెంటల్, ఎమోషనల్ కనెక్టివిటి తెగిపోయినప్పుడే ఇలాంటి మాటలు వస్తాయని వంశీ కుండబద్ధలు కొట్టారు. విజయవాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయినప్పుడు ఎలాంటి పరిస్ధితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధపడ్డానని వంశీ గుర్తుచేశారు. పార్టీ తరపున ఎవరు నాకు మద్ధతుగా లేకపోయినప్పటికీ తాను పోరాటం చేస్తానని అందులో భయపడేది లేదన్నారు.
Also Read:జూ.ఎన్టీఆర్ పేరెత్తి చంద్రబాబును ఏకేసిన వల్లభనేని వంశీ
తనపై తప్పుడు కేసులు పెట్టిన వారి సంగతి చూస్తానన్నారు. ఆంధ్రుడు, తెలుగు విజయం, ప్రైడ్ ఆఫ్ తెలుగు, సీబీఎన్ విజన్ వంటి వెబ్‌సైట్లలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వంశీ ధ్వజమెత్తారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అమిత్ షాను ముందు తిట్టి తర్వాత పుష్ఫగుచ్ఛాలు ఇవ్వొచ్చా అని వంశీ ప్రశ్నించారు.
తాను పడుతున్న ఇబ్బందుల గురించి చంద్రబాబుకు వివరంగా చెప్పానని.. కానీ అటువైపు నుంచి స్పందన లేదన్నారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావించానని.. అయితే తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం ఈ టర్మ్ పనిచేస్తానని స్పష్టం చేశారు.
అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని.. ఎమ్మెల్యేగా ఐదేళ్లు కష్టపడి పనిచేశానని వంశీ గుర్తుచేశారు. సాధ్యమైనంత త్వరలో వైసీపిలో చేరతానని వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. జగన్‌కు మద్ధతిస్తే నాకు ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనం ఉండదని.. నాకు కేసులు కొత్త కాదని, వాటికి భయపడేది లేదని వంశీ స్పష్టం చేశారు.
వైసీపీలోకి అవినాష్.. వల్లభనేని వంశీ అలక....? కారణమేమిటంటే!
ఆర్ధిక లావాదేవీలు, కేసులకు భయపడో తాను వైసీపీకి మద్ధతు తెలపడం లేదన్నారు. ధర్మాపోరాట దీక్షలతో తెలుగుదేశం పార్టీకి ఒరిగిందేమిటని వంశీ ప్రశ్నించారు. అక్రమ కేసులు బనాయించినా, బురద జల్లినా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆమోదించి 151 సీట్లు కట్టబెట్టారని వంశీ గుర్తుచేశారు.
అటువంటి నాయకుడితో ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని, మంచిపనులకు మద్ధతు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు అనవసరమైన ఘర్షణలకు దిగకుండా మంచి పనిని.. మంచిగా ఆమోదిస్తే అందరికీ శ్రేయస్కరమని ఆయన హితవు పలికారు. వర్షాలు తగ్గితే ఇసుక ఇబ్బంది తొలగిపోతుందని వంశీ స్పష్టం చేశారు.