జూ.ఎన్టీఆర్‌పై వంశీ వ్యాఖ్యలు: మళ్లీ ముందుకొచ్చిన నారా, నందమూరి మధ్య తేడాలు

By narsimha lode  |  First Published Nov 14, 2019, 6:16 PM IST

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. నందమూరి, నారా కుటుంబాల మధ్య ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.



విజయవాడ: సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ విషయమై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ  చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలాన్ని రేపుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్‌ టీడీపీ కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనడం లేదని వల్లభనేని వంశీ ప్రశ్నించారు. వల్లభనేని వంశీ లేవనెత్తిన ప్రశ్నలు ప్రస్తుతం టీడీపీలో హట్‌ టాపిక్‌గా మారాయి.

టీడీపీలో చోటు చేసుకొన్న  పరిణామాలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ  పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. పార్టీ నాయకత్వం కొంత కాలంగా అనుసరించిన విధానాలను ఆయన తూర్పారబట్టారు.

Latest Videos

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  2009 ఎన్నికలకు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు నారా, నందమూరి కుటంబాల మధ్య ఎలాంటి గ్యాప్ లేదని సంకేతాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేశారు.

2009 ఎన్నికలకు ముందు హైద్రాబాద్‌లోని  అప్పడు ఉన్న తన నివాసంలో హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ చంద్రబాబునాయుడుతో  సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత ఆ ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు. శ్రీకాకుళం జిల్లా నుండి టీడీపీ అభ్యర్ధుల తరపున జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాడు.

శ్రీకాకుళం జిల్లా నుండి  ఖమ్మం జిల్లా వరకు పలు  చోట్ల ఎన్నికల ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్ విస్తృతంగా పాల్గొన్నాడు. అయితే  ఆ ఎన్నికల ప్రచారం చివరి రోజున ఖమ్మం నుండి హైద్రాబాద్‌కు తిరిగి వస్తున్న సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు.

తీవ్రంగా గాయపడిన జూనియర్ ఎన్టీఆర్ ఆసుపత్రిలో మంచంపై ఉండి కూడ టీడీపీ అభ్యర్ధులను గెలిపించాలని కోరాడు. అయితే ఆ ఎన్నికల్లో  టీడీపీ ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీ  ఆ సమయంలో  ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

ఆ ఎన్నికల తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో కూడ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున ప్రచారం నిర్వహించలేదు. ఎన్నికల ప్రచారానికి ఆయన దూరంగా ఉంటున్నారు.

2018 డిసెంబర్ 7వ తేదీన తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లి నుండి నందమూరి సుహాసిని టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసింది. అయితే తన సోదరి తరపున ఎన్నికల ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ రాలేదు. సుహాసిని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండాలని కూడ జూనియర్ ఎన్టీఆర్ కోరినట్టుగా కూడ ఆ సమయంలో ప్రచారం సాగింది.

2009 ఎన్నికల తర్వాత టీడీపీ నాయకత్వానికి జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య అగాధం పెరిగింది. క్రమంగా ఈ అగాధం పెరుగుతూ వచ్చిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.అయితే ఇదంతా ఒట్టిదేనని టీడీపీ నాయకత్వం కొట్టిపారేస్తోంది.

2009 ఎన్నికల తర్వాత టీడీపీలో లోకేష్ క్రియాశీలక పాత్ర పోషించారు. వ్యాపార రంగంలో ఉన్న లోకేష్ ఆ తర్వాత హెరిటేజ్ సంస్థలో తన పదవికి రాజీనామా చేసి టీడీపీలో  క్రియాశీలకంగా పని చేశారు.

2014 ఎన్నికలకు ముందు జరిగిన ఉప ఎన్నికల సమయంలో  లోకేష్ కీలకంగా వ్యవహరించారు.  ఈ క్రమంలోనే లోకేష్‌ను టీడీపీ  ప్రధాన కార్యదర్శిగా నియమించారు.  ఆ తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాలుగా విభజన జరిగిన సమయంలో  లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 

మరో వైపు నందమూరి కుటుంబాన్ని దూరం పెట్టలేదనే సంకేతాలు ఇచ్చే ఉద్దేశ్యంతో 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో  హిందూపురం నుండి  నందమూరి బాలకృష్ణకు చంద్రబాబునాయుడు టిక్కెట్టు ఇచ్చారు. 2019 ఎన్నికల్లో ఇదే స్థానం నుండి బాలకృష్ణ పోటీ చేసి విజయం సాధించారు.

2014 ఎన్నికలకు ముందు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న హరికృష్ణ ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజనను నిరసిస్తూ  తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత రాజ్యసభ ఎంపీ పదవి కోసం హరికృష్ణ చంద్రబాబును కోరారు.అయితే హరికృష్ణకు ఆ పదవిని కట్టబెట్టలేదు.

2014లో అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో టీటీడీ ఛైర్మెన్  పదవిని హరికృష్ణకు కట్టబెడతారని  ప్రచారం జరిగింది. కానీ, ఈ పదవిని చదలవాడ కృష్ణమూర్తికి, ఆ తర్వాత సుధాకర్ యాదవ్ కు ఇచ్చారు.

నందమూరి కుటుంబంతో టీడీపీకి అగాధం లేదనే సంకేతాలు ఇచ్చేందుకు చంద్రబాబు అవకాశం వచ్చినప్పుడల్లా ప్రయత్నాలు చేస్తుంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. హరికృష్ణ మృతి చెందిన ఏడాది పూర్తైన తర్వాత  హరికృష్ణ కుటుంబసభ్యులైన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లతో చంద్రబాబునాయుడు కలిశారు.

జూనియర్ ఎన్టీఆర్ అవసరం తమకు లేదని  బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. అయితే పరిణామాలన్నింటిని పరిశీలిస్తే ఉద్దేశ్యపూర్వకంగానే జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టారా అనే చర్చ కూడ లేకపోలేదు.ఈ అనుమానాలకు బలం చేకూర్చేలా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురువారం నాడు టీడీపీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. 

జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితులుగా ముద్రపడిన ప్రస్తుత ఏపీ సివిల్ సప్లయిస్ మంత్రి కొడాలి నాని 2014 ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఆ సమయంలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును తిరిగి టీడీపీలో చేరేలా ఆనాడు బాలకృష్ణ  చక్రం తిప్పారు. 

బాలకృష్ణ ఆ సమయంలో  రావి వెంకటేశ్వరరావును చంద్రబాబు వద్దకు తీసుకొచ్చారు. 2014 ఎన్నికల్లో రావి వెంకటేశ్వరరావు గుడివాడ నుండి టీడీపీ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.

ఆ సమయంలో గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని ఆ తర్వాత  వైసీపీలో చేరారు. కొడాలి నాని వద్దే ఉంటూ జూనియర్ ఎన్టీఆర్ ఇంటర్ చదివారు. మరో వైపు వల్లభనేని వంశీ కూడ జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడు.

వల్లభనేని వంశీ  జూనియర్ ఎన్టీఆర్ నటించిన కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు.  టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్నారు.పార్టీలో  జూనియర్ ఎన్టీఆర్‌ టీడీపీ కార్యక్రమాల్లో ఎందుకు కన్పించడం లేదని ప్రశ్నించారు. గతంలో మహానాడు కార్యక్రమాల్లో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కూడ ప్రసంగించిన సందర్భాలు ఉన్నాయి.

మహానాడుకు కూడ జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు. సినిమా షూటింగ్ బిజీ వల్లే  షూటింగ్‌లకు  దూరంగా ఉంటున్నట్టుగా ఆయా సమయాల్లో జూనియర్ ఎన్టీఆర్ సన్నిహిత వర్గాలు ప్రకటించాయి. 

జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఆయనకు సన్నిహితంగా ఉన్న వర్గాలను పార్టీ నుండి బయటకు పంపేందుకు ప్రయత్నాలు చేశారా అనే చర్చ జరిగేలా వంశీ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్‌ టాపిక్ గా మారింది. 

click me!