టిడిపి ఎమ్మెల్యే గద్దె దంపతుల నిరాహారదీక్ష...ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లివే

By Arun Kumar PFirst Published Apr 13, 2020, 10:42 AM IST
Highlights

లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న నిరుపేదలకు సాయం చేయాలని డిమాండ్ చేస్తూ  టిడిపి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దంపతులు నిరాహారదీక్షకు దిగారు. 

విజయవాడ: లాక్ డౌన్ కారణంగా తీవ్ర సమస్యలను ఎదుర్కొంటూ కష్టాలపాలైన నిరుపేదల కోసం టిడిపి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పోరాటానికి దిగారు. తన భార్యతో కలిసి విజయవాడలో 12 గంటల నిరాహారదీక్షకు దిగారు. 

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ విధించడంతో ఉపాధి కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు రూ. 5 వేలు చొప్పున ఇవ్వాలన్నారు.  అన్నా క్యాంటీన్లు, చంద్రన్న బీమా పథకాలు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. గద్దె రామ్మోహన్ దంపతుల దీక్షకు టిడిపి ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్న, అశోక్ బాబులు మద్దతు తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఆదివారం సాయంత్రం నాటికి రాష్ట్రంలో కొత్తగా 15 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 420కి చేరింది. 84 కేసులతో కర్నూలు జిల్లా మొదటి స్థానంలోనూ, 82 కేసులతో గుంటూరు జిల్లా రెండో స్థానంలో నిలిచింది.

కాగా రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో అందరికీ మాస్కులు ఉచితంగా పంపిణీ చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్ నివారణ చర్యలు, లాక్‌డౌన్ తదితర అంశాలపై ఆదివారం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

అయితే లాక్ డౌన్ కారణంగా ఉపాధి  కోల్పోయిన నిరుపేద, వలస కూలీలకు జగన్ సర్కార్ ఆదుకోవడంతో లేదని... వారి కుటుంబాలు ఆకలిబాధతో అలమటిస్తున్నాయని గద్దె రామ్మోహన్ ఆరోపిస్తున్నారు. లాక్ డౌన్ మరో 15రోజులు పొడిగించే అవకాశాలున్నాయి కాబట్టి వెంటనే ప్రభుత్వం వారిని ఆదుకునే చర్యలు చేపట్టాలని గద్దె డిమాండ్ చేశారు. 
 

click me!