కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తోన్న సర్కార్.. దీని వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టింది. దీనిపై జిల్లాల వారీగా గ్రౌండ్ రిపోర్ట్
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తోన్న సర్కార్.. దీని వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టింది. దీనిపై జిల్లాల వారీగా గ్రౌండ్ రిపోర్ట్
రాష్ట్రంలో ఇప్పటి వరకు 420 పాజిటిక్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాలలో కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 7 కేసులు నమోదు కాగా, నెల్లూరు జిల్లాలో 4, కర్నూలు జిల్లాలో 2, ప్రకాశం, వైయస్సార్ కడప జిల్లాలలో ఒక్కో కేసును గుర్తించారు.
కర్నూలు జిల్లాలో ఇప్పటికీ అత్యధికంగా 84 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత గుంటూరు జిల్లాలో 82, నెల్లూరు జిల్లాలో 52, ప్రకాశం జిల్లాలో 42, కృష్ణా జిల్లాలో 35, వైయస్సార్ కడప జిల్లాలో 31, కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
పశ్చిమ గోదావరి జిల్లాలో 22, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాలలో 20 చొప్పున, తూర్పు గోదావరి జిల్లాలో 17, అనంతపురం జిల్లాలో 15 కేసులు నమోదు కాగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
కాగా, కరోనా వైరస్‌కు చికిత్స పొంది ఆస్పత్రుల నుంచి 12 మంది డిశ్చార్జ్ అయ్యారు. విశాఖపట్నం, కృష్ణా జిల్లాలలో 4 గురు చొప్పున.. తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో ఒక్కొక్కరు.. మొత్తం 12 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
వివిధ ఆస్పత్రులలో 407 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటి వరకు 7 గురు చనిపోయారు. అనంతపురం, కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఇద్దరు చొప్పున మరణించగా, కర్నూలు జిల్లాలో మరొకరు చనిపోయారు.
శ్రీకాకుళం జిల్లా:
కాళ్ళు కడుగు.. ఇంటిలో అడుగు పెట్టు.. కాళ్ళు కడిగి ఇంటిలో అడుగు పెట్టడం భారతీయ సాంప్రదాయం. కాలంలో మార్పుతో సనాతన ఆచారాలు, సాంప్రదాయాలలో మార్పులు చోటు చేసుకున్నాయి. బయట నుండి వచ్చిన వ్యక్తి ఇంటిలో ప్రవేశించే ముందు ముఖం, కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వలన 70 శాతం మేర అంటువ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చని కొన్ని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
శ్రీకాకుళం జిల్లాను కరోనా రహిత జిల్లాగా ఉంచాలనే ధృఢ సంకల్పంతో ఇంటిలో ప్రవేశించే ముందు ప్రజల్లో కడుక్కునే అలవాటును పెంపొందించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చారు. దీంతో అనేక గ్రామాల్లో ఇంటి ముంగిట బకెట్‌లో నీళ్లు పెట్టుకుని కడుక్కునే ఆచారాన్ని తిరిగి మొదలు పెట్టారు.
మరోవైపు అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి వారి ఆలయంలో మహా సౌరం, త్రిచ, అరుణం మూడు ఉపనిషత్తులలో సూర్య నమస్కారాలు, మహా సౌర, అరుణ హోమం ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి.
విజయనగరం జిల్లా:
జిల్లాలో కరోనా నియంత్రణకు అన్ని రకాల చర్యలను తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్‌లాల్ తెలిపారు. మిమ్స్ ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మార్చి అన్ని వసతులను ఏర్పాటు చేసి, వైద్యులను, పారా మెడికల్ సిబ్బందిని నియమించామని ఆయన వెల్లడించారు.
జిల్లాలో 22 వెంటిలేటర్లను, 66 ఐ.సి.యు, 959 నాన్ ఐ.సి.యు బెడ్స్‌ను సిద్ధం చేశామని చెప్పారు. 382 మంది వైద్యులతో పాటు, 1186 మంది నర్స్‌లను, పారా మెడికల్ సిబ్బందిని కూడా నియమించామని పేర్కొన్నారు.
జిల్లాలో 4507 బెడ్స్ కెపాసిటీతో 32 క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్న కలెక్టర్, జెఎన్టీయూలో ప్రస్తుతం 120 మంది క్వారంటైన్‌లో ఉన్నారని తెలిపారు. అన్ని ప్రాంతాల నుండి నమూనాలను సేకరిస్తున్నామని, జిల్లా నుండి ఇప్పటి వరకు కరోనా పరీక్షల కోసం 306 నమూనాలు పంపగా 216 నెగటివ్ వచ్చాయని, ఇంకా 90 శాంపిల్స్ ఫలితాలు రావాల్సి ఉందని చెప్పారు.
విశాఖ రహదారులన్నీ మూసివేత:
విశాఖపట్నంలో పాజిటివ్ కేసులున్నందున, అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి వెళ్ళకుండా జిల్లా సరిహదుల్లో ఉన్న రహదారులన్నిటిని మూసివేశామని కలెక్టర్ హరిజవహర్‌లాల్ తెలిపారు. ప్రధాన మార్గాల వద్దే కాకుండా లింక్ రోడ్ల వద్ద కూడా చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి నిఘా పెట్టామని చెప్పారు.
కరోనా నియంత్రణ సామాగ్రి సిద్ధం:
వైద్యుల కోసం 667 పీపీఈ కిట్లు, 1600 ఎన్–95 మాస్కులు, 31,425 గ్లోవ్స్, 69 వేల సర్జికల్ మాస్క్ లు, 9 వేల లీటర్ల శానిటైజర్‌తో పాటు, ఇంకా అవసరమైన వాటన్నింటినీ సిద్ధంగా ఉంచామని కలెక్టర్ వివరించారు.
విశాఖపట్నం జిల్లా:
కరోనా వైరస్ నియంత్రణకు అన్ని రకాల జాగ్రత్త చర్యలను చేపట్టడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ వెల్లడించారు. జిల్లాలో ఇప్పటికే ఏడు కంటైన్మెంట్ జోన్లు గుర్తించామని ఆయన తెలిపారు.
పట్టణ, గ్రామీణ సర్వైలెన్స్ టీములు బాగా పని చేస్తున్నాయని ఇంటింటికి సర్వే చేపట్టి అనుమానిత కేసులను గుర్తించి వారిని క్వారంటైన్ కు తరలించి టెస్టులను చేయించి వారిని 14 నుండి 28 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచడం జరుగుతుందని చెప్పారు.
జిల్లాలో ఇప్పటికే 20 పాజిటివ్ కేసులు గుర్తించగా, కొత్తగా కేసులు నమోదు కావడం లేదని కలెక్టర్ తెలిపారు. 7 కంటైన్మెంట్ జోన్లలో 446 అనుమానిత కేసులు గుర్తించామని, విదేశాల నుండి వచ్చిన వారు క్వారంటైన్ 28 రోజులు పూర్తయిన తర్వాత నెగటివ్ వచ్చిన వారిని డిశ్చార్జి చేసి హోమ్ క్వారంటైన్‌లో ఉంచి వారి ఆరోగ్య పరిస్థితులపై కూడా నిఘా ఉంచడం జరుగుతున్నదన్నారు.
పాయకరావుపేట కేసుకు సంబంధించి అతనితో సన్నిహితంగా ఉన్న 56 మందిని గుర్తించి పరీక్షలు చేయించడం జరిగిందని, వారిలో 37 మందికి నెగిటివ్ రాగా మిగిలిన వారిని పరిశీలనలో ఉంచామన్నారు. క్వారంటైన్‌కు సంబంధించి ఎన్‌అర్‌ఐ, గాయత్రి, అపోలో ఆçస్పత్రుల్లో దాదాపు 2,500 సింగిల్ బెడ్ల రూమ్‌లు సిద్ధంగా ఉంచామని కలెక్టర్ వివరించారు.
జిల్లాలో అందుబాటులో ఉన్న మొత్తం పడకలు: 2188
గీతం ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో ఉన్న వారు: 16
శనివారం వరకు ఆస్పత్రుల్లో చేరిన వారు: 20
పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయిన వారు: 4
వివిధ క్వారంటైన్ కేంద్రాలలో ఉన్న వారు: 79
జిల్లాలో మొత్తం క్వారంటైన్ కేంద్రాలు: 90
మొత్తం క్వారంటైన్ పడకలు: 3927
పశ్చిమ గోదావరి జిల్లా:
జిల్లాలో కరోనా అనుమాని శాంపిల్స్ ఇప్పటి వరకు 841 పరీక్షలకు పంపగా, 22 కేసులు పాజిటివ్‌గా వచ్చాయి. 445 శాంపిల్స్ నెగటివ్‌గా రాగా, ఇంకా 374 శాంపిల్స్ ఫలితాలు రావాల్సి ఉంది.
కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స కోసం జిల్లా ఆస్పత్రిలో 10 వెంటిలేటర్లు, ఆశ్రమ ఆస్పత్రిలో మరో 20 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని, ఇవి కాకుండా వివిధ ప్రైవేటు ఆస్పత్రుల నుంచి మరో 46 వెంటిలేటర్లు సేకరించి కోవిడ్ ఆస్పత్రులలో సిద్ధంగా ఉంచామని జిల్లా అధికారులు తెలిపారు.
కృష్ణా జిల్లా:
జిల్లాలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులేవీ నమోదు కాలేదు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ అనుమానిత 1040 శాంపిల్స్‌ను పరీక్షల కోసం పంపగా వాటిలో 35 పాజిటివ్‌గా గుర్తించారు. శాంపిల్స్‌లో 698 నెగటివ్ రాగా, ఇంకా 307 ఫలితాలు రావాల్సి ఉంది.
జిల్లాలో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో నలుగురు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాలో 32 క్వారంటైన్ సెంటర్లు నిర్వహిస్తుండగా వాటిలో 422 మందిని ఉంచి పర్యవేక్షిస్తున్నారు. ఉపాధి కోసం జిల్లాకు వచ్చిన వలస కార్మికుల కోసం 56 శిబిరాలు ఏర్పాటు చేసి, వాటిలో 4300 మందికి వసతి కల్పిస్తున్నారు.
కాగా, సోమవారం నుంచి జిల్లాలో విస్తృతంగా కరోనా వైరస్ పాజిటివ్ టెస్టులు చేస్తామని కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ వెల్లడించారు. జిల్లాకు కొత్తగా 6 ట్రునాట్ మిషన్లు వచ్చాయని, వాటి ద్వారా రోజుకు 900 పరీక్షలు చేయవచ్చని ఆయన తెలిపారు.
అలాగే ర్యాపిడ్ టెస్టు కిట్లు కూడా రానున్నాయని, వీటన్నింటినీ ఉపయోగించి జిల్లా వ్యాప్తంగా 50 పరీక్షలు చేయాలని నిర్ణయించామని చెప్పారు. పూలింగ్ కింద ఒకేసారి 16 మంది శాంపిల్స్ టెస్ట్ చేయవచ్చని కలెక్టర్ ఇంతియాజ్ వివరించారు.
గుంటూరు జిల్లా:
కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వ్యక్తులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు ఎన్‌ఆర్‌ఐ వైద్య కళాశాల ఆస్పత్రిని జిల్లా కోవిడ్ ఆసుపత్రిగా మార్చి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్ కుమార్ వెల్లడించారు.
మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ వైద్య కళాశాల ఆస్పత్రిని ఆదివారం సందర్శించిన ఆయన, కోవిడ్ –19 పాజిటివ్ వ్యక్తులకు చికిత్స కోసం కేటాయించిన గదులతో పాటు, వైద్యులు ఉపయోగించే వ్యక్తిగత భద్రత ఉపకరణాలు (పీపీఈ కిట్లు) పరిశీలించారు.
పాజిటివ్ వ్యక్తులు ఆసుపత్రిలో రాకపోకలు సాగించేందుకు ప్రత్యేకమైన మార్గాలు ఏర్పాటు చేయాలని ఆసుపత్రి నిర్వాహకులకు సూచించారు. కేంద్ర ఆరోగ్య శాఖ నిబంధనల మేరకు వైద్య చికిత్స అందించాలని, తీవ్ర అనారోగ్య సమస్యలున్న వారిని విజయవాడలోని స్టేట్ కోవిడ్ –19 ఆసుపత్రికి తరలించాలన్నారు. ఆసుపత్రిలో వున్న వారికి డైటీషియన్ సూచనల ప్రకారం ఆరోగ్యకరమైన ఆహరం అందివ్వాలన్నారు.
జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో ఉన్న వసతులు చూస్తున్నామని, ఈ ఆస్పత్రిలో 400 నాన్ ఐసీయూ బెడ్లు, 60 ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.
ఆస్పత్రిలో చికిత్స అందించే వారికి అవసరమైన క్వాలిటీ పీపీఈ కిట్లు అందించామని చెప్పారు. క్వారంటైన్ ఐసోలేషన్ కేంద్రాలు 5 వేల సింగిల్ రూమ్ అటాచ్ద్ బాత్ రూమ్ తో ఏర్పాటు చేశామని, వాటిలో 1100 మంది వరకు ఉన్నారని వివరించారు.
అనంతపురం జిల్లా:
అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకు కరోనా అనుమానిత కేసుల శాంపిల్స్ 1198 పరీక్షలకు పంపించగా, 675 ఫలితాలు వచ్చాయి. వాటిలో 15 కేసులు పాజిటివ్‌గా తేలగా, 660 శాంపిల్స్ నెగటివ్‌గా వచ్చాయి. ఇంకా 523 శాంపిల్స్ ఫలితాలు రావాల్సి ఉంది.
జిల్లాలో ఏర్పాటు చేసిన 33 క్వారంటైన్ కేంద్రాలలో 299 మందిని ఉంచి పర్యవేక్షిస్తున్నారు. వలస కూలీలకు 26 కేంద్రాలు ఏర్పాటు చేయగా, వాటిలో 1044 మంది వసతి పొందుతున్నారు.
జిల్లాకు విదేశాల నుంచి 860 రాగా, వారందరినీ ట్రాక్ చేసి హోం ఐసొలేషన్‌లో ఉంచారు. వారిలో 623 మంది ఇప్పటికే ఆ పీరియడ్ పూర్తి చేసుకోగా, ఇంకా 237 మంది హోం ఐసొలేషన్‌లో కొనసాగుతున్నారు.
వైయస్సార్ కడప జిల్లా:
జిల్లాలో ఏర్పాటు చేసిన అన్ని క్వారంటైన్ కేంద్రాల్లో పారిశుధ్ధ్యం పెంపునకు పెద్ద పీట వేయాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్‌కామన్ క్వారంటైన్ కేంద్రాల నోడల్ అధికారులను ఆదేశించారు.
ఆదివారం ఆయన నోడల్ అధికారులతో సమావేశమయ్యారు. క్వారంటైన్ కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం అవసరమైతే రోజువారీ కూలీ లను నియమించుకోవాలని ఆదేశించారు. ఇందుకు ప్రభుత్వం నిధులు కూడా కేటాయించిందని తెలిపారు.
అదే విధంగా పారిశుద్ధ్య సిబ్బందికి కూడా వ్యక్తిగత భద్రత ఉపకరణాలు (పీపీఈ కిట్లు), శానిటైజర్లు అందజేయాలని కోరారు. అన్ని క్వారంటైన్ కేంద్రాలలో అవసరమైన సిబ్బంది రోజంతా అందుబాటులో ఉండాలని నిర్దేశించారు.
ప్రైమరీ కాంటాక్టస్ వారికి నెగటివ్ వచ్చినప్పటికీ 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచి, ఇంటికి పంపించే సమయంలో మరోసారి వైద్య పరీక్షలు చేయించాలని, ఇళ్లకు వెళ్లిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ నిర్దేశించారు.